చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం
తల్లాడ: సాగర్ ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందిస్తామని.. పంటలు ఎండిపోకుండా కాపాడుతామని జలవనరుల శాఖ డీఈ వి.శ్రీనివాసరావు వెల్లడించారు. తల్లాడ మండలం బస్వాపురంలోని మేజరు కాల్వ, వరి పైర్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కోసం కాల్వకు అడ్డుగా పెట్టిన రేకులు, చెక్కలను తీయించారు. ఎనిమిదో కి.మీ. వరకు నీటి పారుదలను పరిశీలించిన ఆయన సిబ్బందికి సూచనలు చేశారు. ఏఈ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
మిరప తోటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఏన్కూరు: మండలంలోని జన్నారంలో పలువురు రైతులు సాగు చేసిన మిరప తోటలను వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు పీఎన్‌ఎస్.ఫణిశ్రీ, వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ నరసింహారావు, ఏఈఓలు నవ్య, శ్రీకాంత్ చేన్లను పరిశీలించి మిరపలో కాయకుళ్లు, లద్దె పురుగు ఉధృతి ఉన్నట్లు నిర్ధారించారు. అక్కడక్కడా పేనుబంక కూడా కనిపిస్తోందని తెలిపారు. ఈ మేరకు చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు స్వర్ణ కృష్ణయ్య, కొమ్మూరి శంకరయ్య, ఎస్‌కే.అస్గర్, మేళ్ల నరసింహారావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు ఈనెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. గణితం, పొలిటికల్ సైన్స్ రెండేసి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులు బయోడేటా, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు స్థానికత ధ్రువీకరణ పత్రం లేదా 4నుంచి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో ఈనెల 10న సాయంత్రం 5గంటలల్లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మల్టీజోన్ –1 పరిధి అభ్యర్థులు మాత్రమే అర్హులని, పీజీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్ల డించారు. పూర్తి వివరాలకు www. khammam.telangana.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని డీఐఈఓ సూచించారు.
తాగునీటి కోసం హైవేపై రాస్తారోకో
నేలకొండపల్లి: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి తాగునీరు అందక అల్లాడుతున్నామని మండలంలోని పైనంపల్లి ఎస్సీ కాలనీ ప్రజలు సోమవారం కోదాడ–ఖమ్మం జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారాకో నిర్వహించారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవిస్తే నిధులు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని నచ్చచెప్పగా ఆందోళన విరమించారు. స్థానికులు కోటయ్య, ఇస్సాక్, గొర్రె బాలరాజు, కె.రాణి, కె.కళ, దేవకర్ణ తదితరులు పాల్గొన్నారు.
లైన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు
చింతకాని: మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన రైతు గూని ప్రసాద్ విద్యుత్ ఘాతానికి గురై ఇటీవల మృతి చెందగా విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. ఈమేరకు శాఖాపరమైన విచారణ చేపట్టిన అధికారులు లైన్‌మెన్ విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment