విహారయాత్రకు తలసేమియా చిన్నారులు
ఖమ్మంవైద్యవిభాగం : తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారుల్లో మానిసిక ఉల్లాసాన్ని నింపేందుకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులను విహారయాత్రకు తీసుకెళ్లారు. ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు టీజీఎస్ ఆర్టీసీ బస్సు ద్వారా ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీరాల బీచ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ ప్రొద్దుటూరి అనిత మాట్లాడుతూ నిత్యం రక్తం ఎక్కించుకుంటూ, మందులు వాడుతున్న చిన్నారులను ఆ బాధ నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు తమ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులను పర్యాటక ప్రాంతాలకు, విహార యాత్రకు తీసుకెళ్తామని తెలిపారు. పిల్లల కోరిక మేరకు ఈ ఏడాది సముద్రం చూపించేందుకు చీరాల బీచ్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. తమకు తలసేమియా వ్యాధి ఉందనే భావన నుంచి చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి విహార యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీచ్‌లో సముద్ర అలల వద్ద చిన్నారుల ఆటలు చూస్తుంటే ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, చిన్నారులను రక్షించుకోవడంతో పాటు వారిలో ఉల్లాసాన్ని నింపేందుకు సంస్థ ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షురాలు పి.పావని, కోశాధికారి పి.రవిచందర్, బాధ్యులు పి.ఉదయ్‌భాస్కర్, ఎన్.ఉపేందర్, తలసేమియా బాధిత చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment