ట‘మోత’ మోగుతోంది!
ఖమ్మంవ్యవసాయం: టమాటా ధరకు రెక్కలొచ్చాయి. జిల్లాలో అవసరాలకు తగినట్లుగా పంట దిగుబడి లేకపోవడంతో డిమాండ్ పెరిగింది. గత నెలలో కురిసిన వర్షాలతో టమాట తోటలు దెబ్బతిన్నాయి. దీంతో వర్షాలకు ముందు రూ.24 నుంచి రూ.30 కిలో టమాటా ధర ఆ తర్వాత క్రమంగా పెరుగుతోంది. సెప్టెంబర్ రెండో వారంలో రూ.35 పలకగా, మూడో వారంలో రూ.40కి చేరింది. ఈ నెల మరింత పెరుగుతూ రూ.100కు చేరగడం గమనార్హం. రైతుబజార్లలో రూ.80లు పలుకుతున్న ధర ఇతర ప్రాంతాలు, రిటైల్ మార్కెట్‌లో రూ.100 వరకు పలుకుతుంది. ఖమ్మం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు నిత్యం 80 టన్నుల వరకు వచ్చే టమాటాలు ఇప్పుడు 40టన్నులే వస్తున్నాయి. ఖమ్మం నుంచే భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నల్లగొండ తదితర జిల్లాలకు కూరగాయలు సరఫరా చేస్తారు. స్థానికంగా లభ్యత లేకపోవడంతో మధ్యప్రదేశ్, కర్ణాటకతో పాటు ఏపీలోని మదనపల్లి నుంచి హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నా వారి ఆర్డర్ల మేరకు సరఫరా లేక ధర పెరుగుతోందని చెబుతున్నారు.
వర్షాలే కారణం
గత నెలలో కురిసిన వర్షాలతో అన్ని పంటలతో పాటే టమాటా తోటలు కూడా దెబ్బతిన్నాయి. సీజన్ ప్రారంభమయ్యే సమయానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టమాటా విస్తారంగా సాగు చేస్తారు. ఏన్కూరు, జూలూరుపాడు, చింతకాని, బోనకల్, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, సుజాత్‌నగర్ తదితర మండలాల్లో సాగు చేస్తుండగా, సుజాత్‌నగర్, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల రైతులు 20 నుంచి 30 ఎకరాల వరకు సాగు చేసి విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. తక్కువ మొత్తంలో సాగు చేసే రైతులు ఖమ్మం హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు స్థానికంగా విక్రయిస్తారు. కానీ ఈసారి పరిస్థితులు తలకిందులయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.25 వరకు పలకగా ఈ ఏడాది నాలుగు రెట్లు పెరగడం.. ఇంకా పెరిగే అవకాశముందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
కిలో ధర రూ.80 నుంచి రూ.100
నెల రోజుల్లో రెట్టింపైన ధర
Comments
Please login to add a commentAdd a comment