మాట్లాడుతున్న డీఎస్పీ ఉమేందర్
● కారు, సెల్‌ఫోన్ స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఉమేందర్
ఆదిలాబాద్‌రూరల్: గతేడాది డిసెంబర్ 18న మావల సమీపంలో దళిత యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు ఉష్కం రఘుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఉమేందర్ శనివారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మావల గ్రామానికి చెందిన ఎంబడి వంశీతో రఘుపతి కూతురుకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని రఘుపతి నిర్ణయించుకున్నాడు. నవంబర్ 25న చౌహన్ రవి, అశోక్‌లతో రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందుగా రూ.లక్ష ఇచ్చేశాడు. నవంబర్ 29న వారిని కారులో తీసుకెళ్లి వంశీ ఇంటిని చూపించాడు. హత్య చేయడానికి జీపు కావాలని అశోక్ దిల్షాద్‌ను సంప్రదించగా ఆయన రాజుతో మాట్లాడి జీపును సిద్ధం చేశాడు. హత్యాయత్నానికి ఒకరోజు ముందు రవి, అశోక్ గ్రామంలో రెక్కీ నిర్వహించారు. డిసెంబర్ 18న ఉదయం 5 గంటల ప్రాంతంలో వంశీ ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లగా వెనుకనుంచి జీపుతో ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వంశీ తండ్రి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చౌహాన్ రవి, అశోక్, దిల్షాద్, రాజు, గంగన్నలను గతంలోనే అరెస్టు చేయగా శనివారం ఉష్కం రఘుపతి మావల గ్రామానికి వస్తున్నాడని సమాచారం రావడంతో మావల శివారు ప్రాంతంలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ సైదారావు, మావల ఎస్సై విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment