దేశసేవకు మేముసైతం..
● డిఫెన్స్ రంగంపై కేడెట్ల ఆసక్తి ● 150 మందికి పైగా ఆర్మీ కొలువులు ● నేడు ఎన్‌సీసీ దినోత్సవం
మంచిర్యాలక్రైం: దేశంలో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) డే నవంబర్ నాల్గవ ఆదివారం రోజున జరుపుకుంటారు. క్రమశిక్షణ కలిగిన యువతను దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. కేడెట్లలో కర్తవ్య భావం, నిస్వార్థ సేవ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే దీని ఉద్దేశం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేడెట్లు త్రివిధ దళాల్లో కొలువులు సాధించి దేశ సేవలో పాల్గొంటున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు సాధించేలా శ్రమిస్తున్నారు. ఎన్‌సీసీలో సీ సర్టిఫికేట్ సాధించి డిఫెన్స్ రంగంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్‌సీసీ డే సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ కేడెట్లు ‘సాక్షి’తో ముచ్చటించారు.
క్రమశిక్షణకు ఎన్‌సీసీ
దేశవ్యాప్తంగా యువత క్రమశిక్షణకు ఎన్‌సీసీకి పేరుంది. కర్తవ్యం, నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ, నైతిక విలువలతో వారి సర్వతోముఖాభివృద్ధికి అవకాశాలను అందిస్తోంది. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవలు, తదితర శిక్షణపై కేడెట్లను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1984లో ఎన్‌సీసీ 32(ఏ)బీఎన్ ఆదిలాబాద్ యూనిట్ బెటాలియన్‌గా ఏర్పాటైంది. ప్రారంభంలో అవగాహన లేకపోవడంతో తక్కువ మంది ఎన్‌సీసీలో చేరారు. రానురాను మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి ఎన్‌సీసీలో శిక్షణ పొందారు. వేలాది మంది ఆర్మీ, నేవీ, బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ వివిధ రక్షణ శాఖల్లో సుమారు 150 మందికి పైగా ఉద్యోగాల్లో చేరారు.
ఎన్‌సీసీ ముఖ్య ఉద్దేశం
ఎన్‌సీసీ 1948 జూలై 16న ఐక్యత క్రమశిక్షణ అనే నినాదంతో వచ్చింది. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు ఏ,బీ,సీ సర్టిఫికెట్లు అందజేస్తారు. శిక్షణలో రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చినవారికి ర్యాంక్‌లు అందిస్తారు. ఆర్‌డీసీ(రిపబ్లిక్ డే క్యాంపు) నిర్వహిస్తారు. ఏటా జనవరి 15న ఢిల్లీలో జరిగే పరేడ్‌కు ఎంపిక చేస్తారు. ఆర్‌డీ క్యాంప్‌నకు సెలెక్ట్ అయినవారికి డ్రిల్, లైన ఫ్లాగ్‌ఏరియా, కల్చరల్ ప్రోగ్రాం, బెస్ట్ కేడెట్ పోటీలు ఉంటాయి. రాష్ట్రాలకు చెందిన వారు పోటీ పడుతుంటారు. కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, ఢిల్లీ సీఎం, త్రివిధ దళాధిపతులు హాజరవుతారు. ఎన్‌సీసీలో శిక్షణ పొందిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. రక్షణ దళంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment