‘హక్కుల సాధనకు పోరాడుతాం’
ఇంద్రవెల్లి: సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిండిగల్ యాదగిరి అన్నారు. గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు మండలంలోని ముత్నూర్‌లో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది పీసీసీ అధ్యక్షుడి హోదాలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే సచివాలయానికి సగౌరంగా ఉద్యోగులను పిలిచి సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు పేస్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల ఉద్యోగులు 17 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం స్పందించడం లేదన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ గోడం గణేశ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థ కుంటూ పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదేరావ్, మహిళా సంఘం అధ్యక్షురాలు రేణుక, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక, కార్యదర్శి ధరంసింగ్, సభ్యులు దీప్తి, శ్రీకాంత్, ప్రశాంత్‌రెడ్డి, ప్రకాష్, మమత, రాథోడ్ విష్ణు, గణేశ్, సందీప్, సలీం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment