శివారు కాలనీల సమస్యలు తీరలే | - | Sakshi
Sakshi News home page

శివారు కాలనీల సమస్యలు తీరలే

Published Mon, Jan 20 2025 12:31 AM | Last Updated on Mon, Jan 20 2025 12:31 AM

శివార

శివారు కాలనీల సమస్యలు తీరలే

ఈ పాలకవర్గ గడువు త్వరలోనే ముగియనుండగా పట్టణంలో కొత్తగా విలీనమైన పలు కాలనీల సమస్యలు మాత్రం ఇప్పటికీ యథాతథమే అన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా 170 కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు వంటి కనీస వసతులు సైతం సమకూరలేదు. మురుగు నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. పట్టణంలోని కాలనీ అయినా పల్లె కంటే అధ్వానంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. బంగారుగూడ, రాంపూర్‌, కొజాకాలనీ, దుర్గానగర్‌, పిట్టలవాడ, సుభాష్‌నగర్‌, న్యూహౌసింగ్‌బోర్డు, టీచర్స్‌కాలనీ వంటి అనేక కాలనీల్లోనూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని పనులు చేపట్టినా ఆశించినస్థాయిలో అభివృద్ధి కానరాని పరిస్థితి.

కై లాస్‌నగర్‌: ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ.. పట్టణాన్ని ప్రగతిపథంలో పయనింపజేయడంలో మున్సిపల్‌ పాలకవర్గానిది కీలకపాత్ర. ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు మరి న్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారనే గంపెడాశతో ప్రజలు ప్రతీ ఐదేళ్లకోసారి నూతన పా లకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా 2020లో కొలువుదీరిన ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ గడువు మరో ఆరు రోజుల్లో ముగియనుంది. ఈ ఐదేళ్ల వ్యవధిలో కోట్లాది రూపాయలు ఖ ర్చయినా ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి దిశగా అడుగులు పడినప్పటికీ వందలాది పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోకపోవడం గమనార్హం. మరికొన్ని పనులు అసంపూర్తిగా మిగిలా యి. ప్రధాన కూడళ్లు మెరిసినప్పటికీ శివారు కాలనీల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయనే విమర్శలున్నాయి.

రూ.173 కోట్లతో అభివృద్ధి పనులు

ప్రస్తుత కౌన్సిల్‌ హయాంలో ఆదిలాబాద్‌ పట్టణంలో రూ.173.65 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పలు వార్డుల పరిధిలో బీటీ, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, కమ్యూనిటీ హాల్స్‌, ఓపెన్‌ జిమ్‌లు, పార్కులు, పారిశుధ్య నిర్వహణ, వైకుంఠధామాలు వంటి 693 పనులను చేపట్టారు. ఇందులో 41 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నిధుల కొరత కారణంగా 163 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అందులో ప్రజోపకరమైన పనులే ఎక్కువగా ఉండటం గమనార్హం. డంపింగ్‌ యార్డులో రూ.2.81కోట్ల వ్య యంతో 17 పనులు చేపట్టగా అందులో 14 పూర్తి చేశారు. మూడు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే పూర్తి చేసిన పలు పనులకు బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం, సమీకృత మార్కెట్‌ సముదాయ నిర్మాణాలు పునాదులకే పరిమితకావడం నిధుల లేమికి నిదర్శనంగా చెప్పవచ్చు.

మెరిసిన కూడళ్లు ..

పట్టణ సుందరీకరణకు ఈ కౌన్సిల్‌ అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. రూ.8.63 కోట్ల వ్యయంతో 61 పనులు చేపట్టారు. ఇందులో రూ.2.04 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, రూ.2.55 కోట్లతో డివైడర్లను నిర్మించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన అంబేడ్కర్‌చౌక్‌, కలెక్టర్‌చౌక్‌, జగ్జీవన్‌రాంచౌక్‌, భగత్‌సింగ్‌చౌక్‌, నేతాజీచౌక్‌, వినాయక్‌చౌక్‌ వంటి ఆరు జంక్షన్లను రూ.4.36 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. అయితే నెలల వ్యవధిలోనే అవి కళావిహీనంగా మారడం గమనార్హం. ఇక నిత్యం రద్దీగా ఉండే అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌లో భారీ డిడైవర్‌ను నిర్మించి ట్రాఫిక్‌ సమస్యను పెంచారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు వినాయక్‌చౌక్‌లో నిర్మించిన భారీ కట్టడంపై సాక్షాత్తు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ విమర్శలు గుప్పించడంతో పాటు దాన్ని కూల్చేయాలని సమావేశంలోనే ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు తప్ప మిగతా అభివృద్ధి పనులేవి జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభివృద్ధి పనులు అంతంతే

ట్రాఫిక్‌ ఇక్కట్లు యథాతథం

శివారు కాలనీలు సమస్యలమయం

ఈ నెల 26న ముగియనున్న మున్సిపల్‌ పాలకవర్గ పదవీకాలం

అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశాం..

సౌకర్యాలు లేక అధ్వానంగా ఉన్న ఆదిలాబాద్‌ మున్సిపాలిటీని ఐదేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా జిల్లా కేంద్రంలో రైల్వే వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వకుంటే నేను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాను. కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దాన్ని సాధించడం సంతృప్తిగా ఉంది. పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, డివైడర్లు, ప్రధానచౌక్‌లను అభివృద్ధి చేశాం. రూ.2.10 కోట్ల వ్యయంతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను నిర్మించాం. గత పాలకవర్గంలో చేపట్టిన మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అయితే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా నిధుల కొరతతో చేయలేకపోయాం. ప్రజలు మాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాం. ఐదేళ్లలో పట్టణాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశాం.

– జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శివారు కాలనీల సమస్యలు తీరలే 1
1/1

శివారు కాలనీల సమస్యలు తీరలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement