అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
గూడెంకొత్తవీధి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల ప్రజావేదిక బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొట్టడం రాజుబాబు మాట్లాడుతూ మండలంలోని ఉపాధి పనుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఇందుకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లి పంచాయతీ గూనవాయిలంకలో రోడ్డు నిర్మిచకుండానే బిల్లులు చేశారని ఆరోపించారు. దీనిపై ఎంబుక్ చేయలేనట్టు అధికారులు చెబుతున్నారన్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలు చేసే అధికారుల పట్ల ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.జేఏసీ కన్వీనర్ బలరాం, దేవరాపల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు, రామారావు, రామకృష్ణ, శాంతిబాబు, రామారావు, సంతోష్, కృష్ణ, ఉపాధి పథకం అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment