కుశలమా
నేస్తమా..
అనుబంధం, ఆప్యాయతలకు వేదికగా తారుమారు సంత
యోగక్షేమాలు తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
జి.మాడుగుల: ఆదివాసీ గిరిజన సంప్రదాయబద్దంగా మంగళవారం తారుమారు (పండగ) సంత జరిగింది. ఏటా మాదిరిగానే మండల కేంద్రంలోని వెంకటరాజు ఘాట్ వద్ద పంట పొలాల్లో మంగళవారం నిర్వహించారు. జిల్లాతోపాటు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వస్త్ర దుకాణదారులు, నిత్యావసర, తదితర రకాల వ్యాపారులు వచ్చారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన రైతులు రాజ్‌మా చిక్కుళ్లు, పసుపు, అల్లం, పిప్పలి, అడ్డాకులు, కొండచీపుర్లు, నాగలి దుంపలు, కూరగాయలు తదితర అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించారు. కోళ్లు, మేకలు, గొర్రెలు పశువులను ఇక్కడ వారపు సంతలో విక్రయించారు.
● గిరిజన తండాల నుంచి పిల్లలు, వృద్ధులతో పా టు కుటుంబ సమేతంగా సంతకు తరలి వచ్చా రు. గిరిజనులు తీసుకొచ్చిన అటవీ వ్యవసాయోత్పత్తులు వారపు సంతలో విక్రయించగా వచ్చిన సొమ్ముతో సంక్రాంతికి అవసరమయ్యే నిత్యావసర సరకులు, ఇతర సామగ్రి, కుటుంబ సభ్యులకు కొత్త దుస్తులు కొనుగోలు చేశారు.
పెళ్లి సంబంధాల వేదికగా..
ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు, గిరిజన కుటుంబాలు తమతో తీసుకొచ్చిన యుక్త వయసు పిల్లలను ఒకరినొకరు పరిచయాలు చేసుకొని బంధుత్వాలు గురించి ముచ్చటించారు. గిరిజనులకు ఇష్టమైన జీలుగకల్లు, మడ్డికల్లు వంటి మత్తు పానీయాలు కొనుగోలు చేసుకుని ఆయా కుటుంబ సభ్యులందరు ఒక చోట చేరి విందు(పార్టీలు) చేసుకున్నారు. బంధుత్వాలు కుదుర్చుకున్న గిరిజన ప్రజలు, పీవీటీజీ తెగల వారు సంక్రాంతి పండగకు ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు.
కిక్కిరిసిన జి.మాడుగుల రోడ్లు
పండగ సంతకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో జి.మాడుగుల నుంచి దేవుని గెడ్డ, నుర్మతి జంక్షన్ రోడ్డు వరకు కిక్కిరిశాయి. తారుమారు సంతకు సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వచ్చినట్లు అంచనా. పండగ సంతలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారిమళ్లించి పోలీసులు తగు చర్యలు చేపట్టారు.
దూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన గిరిజనులు జోరా అంటూ ఆప్యాయంగా పలకరింపు బంధుత్వాల ముచ్చట్లు నిత్యావసరాలు, వస్త్రాల కొనుగోలు జి.మాడుగులలో సందడి
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తారుమారు సంతను సందర్శించారు. ప్రజలు,స్నేహితులు, బంధువులతో ముచ్చటించారు. సంతకు వచ్చి న అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. వ్యాపారులతో మాట్లాడారు. మట్టి కుండలను పరిశీలించిన ఆయ న కొనుగోలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి శ్రేణులతో ఎమ్మెల్యే కలియతిరిగారు. వైఎస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బ్రహ్మాలింగం, వైఎస్సార్‌సీపీ నాయకులు పండన్న, అంద్రయ్య, కల్యాణం, సూరి బాబు, లక్ష్మినాయుడు, కొండబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment