నిబంధనలకు విరుద్ధంగా పీసా కమిటీ ఎన్నిక
● కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సేరుబయలు గ్రామస్తులు
పాడేరు: నిబంధనలకు విరుద్ధంగా పీసా కమిటీని ఏకపక్షంగా ప్రకటించారని మండలంలోని కిండంగి పంచాయతీ సేరుబయలు గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 5న తమ గ్రామంలో నిర్వహించిన పీసా కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జంపరంగి సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా కూడా నూకరాజు గెలుపొందారన్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారి గుడిసా ప్రసాద్, వీఆర్వో పలాసి పద్మ, పంచాయతీ కార్యదర్శి ప్రియదర్శిని వారికి అందజేశారన్నారు. కానీ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మంగళవారం గ్రామంలో ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ఓడిపోయిన అభ్యర్థులను గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారన్నారు. ఈ నెల ఐదున నిర్వహించిన ఎన్నికల సమయంలో రాని గ్రామస్తులతో సంతకాలు చేయించుకుని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తొలుత 5వ తేదిన జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారిని ఉపాధ్యక్షుడు, కార్యదర్శిగా కొనసాగించాలని కోరారు.
అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల అధికారి..
కొయ్యూరు: శరభన్నపాలెం పీసా కమిటీ ఎన్నికల అధికారి నిబంధనలను పక్కనబెట్టి అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని మంగళవారం కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఓటర్లు ఫిర్యాదు చేశారు. ఈనెల మూడున శరభన్నపాలెంలో పీసా కమిటీ ఎన్నిక జరగలేదు. కౌంటింగ్ జరిగిన తరువాత రెండు ఓట్లు తేడా రావడంతో రీకౌంటింగ్ నిర్వహించాలని మరో వర్గం డిమాండ్ చేసింది. దీనిని సోమవారానికి వాయిదా వేశారు. తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల అధికారి సోమవారం ఎన్నిక నిర్వహించకుండా ఓట్ల లెక్కింపులో ఒకరికి ఎక్కువగా వచ్చాయని ప్రకటించారన్నారు. దీనిపై ఆగ్రహం చెందిన ఓటర్లు ఎన్నికల అధికారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా మంగళవారం ఎన్నిక జరుగుతుందని శరమండ, దద్దుగుల తదితర దూర ప్రాంతాల నుంచి మహిళలు కాలినడకన వచ్చారు. దీనిపై ఎంపీడీవో ప్రసాద్‌ను వివరణ కోరగా ఈనెల మూడు జరిగిన ఎన్నికల్లో ఎవరికై తే ఓట్లు ఎక్కువ వచ్చాయో వారిని సోమవారం ప్రకటిస్తామని తెలిపామన్నారు.తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పలేదన్నారు. కోరం లేని కారణంగా రాజేంద్రపాలెంలో మంగళవారం రెండోసారి జరిగిన ఎన్నిక వాయిదా పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment