రిక్వెస్ట్ స్టేజీలో ప్యాసింజర్ రైలు నిలుపుదలకు చర్యలు
అరకులోయ టౌన్: అరకులోయలో రైల్వే రిక్వెస్ట్ స్టేజీలో విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ రైలు నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని ఎంపీ తనూజా రాణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈనెల ఒకటి నుంచి రైల్వే రిక్వెస్ట్ స్టేజీలో ప్యాసింజర్ రైలు నిలపడం లేదని అరకులోయలోని ఆటో మోటార్ యూనియన్ ప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనివల్ల వందలాది కుటుంబాలు వీధిన పడుతున్నందున సమస్యను విశాఖలో రైల్వే అడిషనల్ డీఆర్‌ఎం, ఈనెల 15న సీనియర్ డీసీఎం పవన్ కుమార్‌ల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అదే సమయంలో తన సమక్షంలో ఆటో, ఇతర కార్మికులతో వారు మాట్లాడారన్నారు. అరకు రైల్వే స్టేషన్ నుంచి శిమిలిగుడ రైల్వే స్టేషన్ వరకు డబుల్ లైన్ వేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అరకులోయలో రైలు రిక్వెస్ట్ స్టేజీని తీసివేసినట్టు వారు తెలిపారన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్యాసింజర్ రైలు నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment