కేంద్ర కారాగారంలో ‘జీవ నదులు’
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం విశాలమైనది. దీని లోపల అన్నీ జీవనదులే ఉన్నాయి. కారాగారం లోపల ఎక్కడికి వెళ్లినా వాటి పేర్లే కనిపిస్తాయి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది నోటి నుంచి ఆ పేర్లే వినిపిస్తాయి. లోపల ఉండే ఖైదీల కోసం ములాఖత్‌కు వెళ్లేవారి బంధువులు, స్నేహితులకు ఈ పేర్లు వినిపిస్తాయి. అసలు కారాగారంలో నదులు ప్రస్తావన ఏమిటని అనుకుంటున్నారు కదూ.. ఆ పేర్లతో ఇక్కడ బ్లాకులను పిలుస్తారు. ఆయా బ్లాకుల్లో ఖైదీలు ఉంటారు. సుమారు 100 ఎకరాల్లో విశాఖ కేంద్ర కారాగారాన్ని నిర్మించారు. దీని సామర్థ్యం 914 మంది. దానికి తగినట్లు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రిమాండ్, శిక్ష పడిన ఖైదీలు ఇక్కడ సుమారు 2,000కు పైగా ఉన్నారు. వీరంతా ఇక్కడ వివిధ బ్లాకుల్లో ఉంటున్నారు.
ఇవీ ఇక్కడి నదుల పేర్లు..
ఇక్కడ 21 బ్లాకులు ఉన్నాయి. త్వరలో మరికొన్ని బ్లాకులు నిర్మాణం చేపట్టనున్నారు. ఆయా బ్లాకులకు దేశంలో ఉండే ప్రముఖ నదుల పేర్లు పెట్టారు. ఆయా పేర్లతోనే వాటిని పిలుస్తారు. ఇక్కడ గంగా, నర్మద, చిత్రావతి, స్నేహ సరోవర్, ప్రాణహిత, శబరి, గోస్తనీ, స్వర్ణముఖి, తపతి, కావేరి, తుంగభద్ర, వంశధార, గోదావరి, కృష్ణవేణి, అన్నపూర్ణ, పెన్నా, నాగావళితో పాటు శాంతివనం, జ్ఞాన సాగర్, స్కిల్ డెవెలప్‌మెంట్ భవనం, పరిశ్రమలు నిర్వహించే భవనం తదితర పేర్లతో దీని లోపల బ్లాకులు నిర్మించారు. గంగా, కృష్ణవేణి బ్లాకుల్లో రిమాండ్ ఖైదీలు ఉంటారు. నర్మదా బ్లాకులో ఇతర రారష్ట్‌రాలకు చెందిన ఖైదీలను ఉంచుతున్నారు. మావోయిస్టు ఖైదీలను ఉంచడానికి చిత్రావతిని కేటాయించారు. సువర్ణముఖిలో మహిళా ఖైదీలు ఉంటారు. మహిళా ఖైదీలంతా రిమాండ్‌లో ఉన్నవారే. గోదావరి బ్లాకులో శిక్ష పడిన ఖైదీలను ఉంచుతారు. దీన్ని ప్రధానమైన బ్లాకుగా పరిగణిస్తారు. తపతి, కావేరి, పెన్నా బ్లాకులను ఖైదీల సెల్ కోసం వినియోగిస్తున్నారు. వాటితో పాటు స్నేహ సరోవర్‌లో అడ్మిషన్లు, శాంతివనం, గోస్తనీ బ్లాకులను ఆడిటోరియం, శబరిని సిబ్బంది కిచెన్‌కు, అన్నపూర్ణ బ్లాకును ఖైదీల కిచెన్‌కు ఉపయోగిస్తున్నారు. ఇవి కాక నాగావళి, వంశధార, తుంగభద్ర బ్లాకులు ఓపెన్ ల్యాండ్‌గా విడిచిపెట్టారు. ప్రాణహితను ఖైదీల ఆస్పత్రి, జ్ఞాన సాగరాన్ని లైబ్రరీ, ఖైదీలకు పాఠశాలగాను వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీ బ్లాకులో వివిధ పశ్రమలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఖైదీలు పని చేస్తారు. ఇక్కడ స్కిల్ డెవెలప్‌మెంట్ బ్లాక్‌లో ఖైదీలకు టైలరింగ్, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తుంటారు. ఈ బ్లాకులన్నీ దేశంలో ప్రవహించే జీవనదుల పేర్లతో నిర్వహించడం విశేషం. ఇక్కడ ఖైదీల సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో మరికొన్ని బ్లాకులు నిర్మించే యోచనలో అధికారులున్నారు. కొత్తగా నిర్మించే బ్లాకులకు ఏ పేర్లు పెడతారో వేచి చూడాలి.
వివిధ బ్లాకులకు దేశంలోని
పలు నదుల పేర్లు
Comments
Please login to add a commentAdd a comment