అయ్యన్న ముంగిట్లో సీఎం రమేష్ హడావుడిరగులుతున్న కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అయ్యన్న ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందడి చేశారు. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్టులో గత మూడు రోజులుగా మకాం వేసిన రమేష్... సంక్రాంతి వేడుకలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. ఇటువైపు కనీసం టీడీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జరుగుతున్న మకర జ్యోతి మహోత్సవాలకు సీఎం రమేష్‌ను ఆహ్వానించలేదు. ఒకవైపు నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను తనకు తెలియకుండా బీజేపీలో చేర్చుకోవడంతోపాటు పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా జరుగుతున్న చేరికలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ప్రధాని సభ సందర్భంగా కూడా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. ప్రధాని సభకు జన సమీకరణ సందర్భంగా... నర్సీపట్నంలో మీరు చేర్చుకున్న నేతల ద్వారా జనాలను తరలించుకోండంటూ సీఎం రమేష్‌కు అయ్యన్న గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం. మొత్తంగా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు రిసార్టు కేంద్రంగా జరిగిన సంక్రాంతి వేడుకలు కాస్తా కూటమిలో భోగి మంటలను మించి వేడిని రాజేశాయని అర్థమవుతోంది.
కొరివితో తలగోక్కున్నట్టు...!
వాస్తవానికి అనకాపల్లి ఎంపీ పోటీలో స్థానికేతరుడైన దిలీప్‌కుమార్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ భావించింది. ఈ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్నపాత్రుడు... స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే మాట్లాడారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌ను బీజేపీ ప్రకటించింది. అనూహ్యంగా అయ్యన్నపాత్రుడు రమేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియతిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్‌తో సఖ్యతగా మెలిగారు. తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారు. దీంతో కొరివితో తలగొక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని అయ్యన్న వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జనసమీకరణపై సీఎం రమేష్ అయ్యన్నను కదిపే ప్రయత్నం చేశారు. మీరు చేర్చుకున్న నాయకులతో జనాలను తరలించుకువెళ్లండంటూ అయ్యన్న గట్టిగానే బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సందర్భంగా సీఎం రమేష్ నర్సీపట్నంలో మకాం వేయడం చర్చనీయాంశమవుతోంది. సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లతో పాటు ఓ డాక్టర్, జనసేన నేతలు సదరు ప్రైవేటు రిసార్టు వద్ద హడావుడి చేస్తున్నారు. అయితే, అటువైపు ఏ ఒక్క టీడీపీ నేత కానీ కార్యకర్త కానీ వెళ్లకపోవడం గమనార్హం.
మూడు రోజులుగా నర్సీపట్నంలో
తిష్ట వేసిన సీఎం రమేష్
బీజేపీ, జనసేన నేతలతో కలిసి
సంక్రాంతి సందడి
కన్నెత్తి చూడని అయ్యన్న, టీడీపీ నేతలు
స్పీకర్ ఆధ్వర్యంలో జరిగే మకరజ్యోతి మహోత్సవానికి రమేష్‌కు
అందని ఆహ్వానం
బీజేపీలో చేరికలపై అయ్యన్న ఆగ్రహం
తనకు సమాచారం లేకుండా
చేర్చుకున్నారని మండిపాటు
ప్రధాని పర్యటనలో తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై కినుక?
విశాఖ డెయిరీ డైరెక్టర్ల చేరికపై...!
విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడిగా అసెంబ్లీలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న ఏర్పాటు చేశారు. దీనిపై పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు తమ పార్టీలో విశాఖ డెయిరీ నేతలను చేర్చుకుంటున్నట్టు సీఎం రమేష్.... అయ్యన్నకు సమాచారమిచ్చినప్పటికీ ఆ విషయంలో ముందుకు వెళ్లడంపై కూడా సీఎం రమేష్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలోని ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లు సూర్యనారాయణ, రాజకుమారిలను బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలోని డాక్టర్ కిలాడి సత్యనారాయణను కూడా తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ చేరిక వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నట్టు అయ్యన్న మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియని సందర్భంలో ప్రతీ చోట పరిచయం చేసిన తననే లెక్కచేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్తా కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment