నష్టపరిహారం చెల్లింపులో మొండిచెయ్యి
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీ పరిధిలోని కత్తనపల్లి గిరిజనులు కోరుతున్నారు. ఇటీవల ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు వంజం జోగారావు ఆధ్వర్యంలో వారు రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంను కలిసి సమస్యను విన్నవించారు.తమ గ్రామంలో 70 ఇళ్లకు నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇంత వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఖాళీ చేసే నాటికి తమ బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుందని, ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేశామని అప్పట్లో చెప్పినా నేటికి అందలేదన్నారు. గ్రామాన్ని ఖాళీ చేసేందుకు నిబంధనల ప్రకారం రవాణా ఖర్చులు ఇవ్వాల్సి ఉండగా అవీ కూడా నేటికి చెల్లించలేదన్నారు. అధిక వడ్డీలకు తెచ్చిన అప్పును చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి బిల్లులు పెట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఎల్‌ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేశామని తెలిపారు. తాజాగా పోలవరం నిర్వాసితులకు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం కత్తనపల్లి నిర్వాసితులకు మొండిచేయి చూపింది. అప్పుడు బిల్లులు పెట్టినట్లు నెంబరు ఇచ్చిన అధికారులు మళ్లీ ఇప్పుడు పెండింగ్ ఉందని చెబుతుండటం గమనార్హం.
పోలవరం ముంపు బాధిత కత్తనపల్లి గిరిజనుల ఆవేదన
గిరిజన నిర్వాసితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం
గిరిజన నిర్వాసితుల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. గిరిజనుల ప్రయోజనాలు కోసం పనిచేయాల్సిన ఐటీడీఏ గిరిజనులను పట్టించుకోకపోవడం దారుణం. గ్రామాలను ఖాళీ చేసి వచ్చి పునరావాస కాలనీల్లో అష్టకష్టాలు పడుతున్నారు. రావాల్సి పరిహారం అందక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి న్యాయం చేయకపోతే ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో త్వరలో ఆందోళనకు దిగుతాం.
–వేట్ల విజయ, సర్పంచ్, కొండమొదలు
Comments
Please login to add a commentAdd a comment