జవాబుదారీతనం ముఖ్యం
విశాఖ లీగల్: న్యాయపరమైన అంశాలను సమాజానికి అందించే క్రమంలో సమాచార వ్యవస్థ, న్యాయస్థానాలు జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పలువురు సీనియర్ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న సౌత్ జోన్–2 న్యాయమూర్తుల సదస్సు ఆదివారం సాయంత్రం ముగిసింది. ఉదయం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.పి.కురియన్ జోసెఫ్ అధ్యక్షతన న్యాయ వ్యవస్థ, ప్రసార మాధ్యమాలు అన్న అంశంపై చర్చ జరిగింది. శ్రీమీడియా ఆన్ జస్టిస్ డెలివరీ సిస్టం, సోషల్ మీడియాతో అనుసంధానం, డిజిటల్ యుగంలో మీడియా స్వేచ్ఛ, పౌర సమాజంపై ప్రభావంశ్రీ అనే అంశాలపై చర్చించారు. శ్రీఆధునిక సమాచార వ్యవస్థ–న్యాయ వ్యవస్థపై ప్రభావంశ్రీ అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. భవిష్యత్తులో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే న్యాయస్థానాల విషయంలో మీడియా పాత్ర కూడా ఉంటుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. మీడియా అందించే సమాచారం విశ్వసనీయతను కలిగి ఉండాలని సూచించారు. అదే పరస్పర సహకారానికి ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ మీడియాలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని, కొన్ని సందర్భాల్లో కోర్టులను, కోర్టు పరిధిలోని అంశాలపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు.
మీడియా వ్యవస్థపై అవగాహన ఉండాలి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషిమి భట్టాచార్య మాట్లాడుతూ జ్యుడీషియరీ విభాగంలో పనిచేసే వారు మీడియాపై, అక్కడ జరిగే పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కోల్‌కతాలో జరిగిన ఆర్జీకర్ ఆస్పత్రితో పాటు పలు ఘటనల్లో మీడియా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. మెయిన్‌స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాకు ఉన్న పరిమితుల గురించి ఇరు వర్గాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. కోర్టు వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత్రపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎం.సుందర్ విశ్లేషించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి ఎ.ఎం.ముస్తాక్యు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. కేరళ హైకోర్టులో అనుసరిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి పీపీటీ ద్వారా వివరించారు. సదస్సు ముగింపు సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిలారీ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, ఇతర సీనియర్ న్యాయమూర్తులు, హైకోర్టు, జిల్లా కోర్టుల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
న్యాయపరమైన అంశాల్లో కచ్చితత్వం ప్రధానం
సమాచార వ్యవస్థ, న్యాయస్థానాలపై గురుతర బాధ్యత
పలువురు సీనియర్ న్యాయమూర్తుల అభిప్రాయం
ముగిసిన సౌత్ జోన్–2 న్యాయమూర్తుల సదస్సు
Comments
Please login to add a commentAdd a comment