నేడే పూడిమడక జాగరణ
అచ్యుతాపురం : అందాల సహజ తీరం పూడిమడక ఒడ్డున మాఘ పౌర్ణమి వేడుకలకు ముస్తాబయ్యింది. లక్షకు పైగా జనాభా విచ్చేసే మాఘ పౌర్ణమి జాగరణ సందర్భంగా మంగళవారం రాత్రి సముద్ర తీరాన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. వివిధ తినుబండారాలతో కూడిన స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. బాణాసంచా విన్యాసాలు అలరించనున్నాయి. వారం రోజుల నుంచి జగన్నాథస్వామి ఆలయంలో పూజలు ప్రారంభం అయ్యాయి. పూడిమడక ప్రధాన రహదారుల్లో విద్యుత్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకూ జాతరను ఆస్వాదించనున్న మత్స్యకార కుటుంబీకులు, జిల్లా ప్రజలు రాత్రి అంతా జాగారం ఉంటారు. ప్రత్యేక బృందాలు, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. బుధవారం తెల్లవారు జాము నుంచి పౌర్ణమి స్నానాలు ఆచరిస్తారు. ఇందుకోసం మొబైల్ బాత్‌రూంలు, బట్టలు మార్చుకునే షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తీరంలో ప్రమాదస్థాయి లోపు భారీ తాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి పూడిమడక వరకూ ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు. అచ్యుతాపురం జంక్షన్ దాటిన తర్వాత ప్రైవేట్ వాహనాలను నియంత్రించనున్నారు. పూడిమడక హైస్కూల్ జంక్షన్ తర్వాత ఎటువంటి వాహనాలను అనుమతించే అవకాశం లేదని సీఐ గణేష్ తెలిపారు. జాతరకు ఏర్పాట్లపై పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ పర్యవేక్షించారు. స్థానిక పోలీసు అధికారులు, ఇతర శాఖల అఽధికారులతో చర్చించారు. కాగా ఈ విడత జాతర వేడుకల ఏర్పాట్ల బాధ్యత నుంచి సర్పంచ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జాతరను తాము నిర్వహిస్తామని తేదేపా, జనసేన శ్రేణులు పోటీ పడ్డాయి. చివరకు రెండు వర్గాలు కలిసి జాతరను నిర్వహించాలని నిర్ణయించారు. జాతరల్లో మితిమీరిన రాజకీయ జోక్యం తగదని గంగ పుత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment