ఉపమాకకు బ్రహ్మోత్సవ శోభ
● నేడు అంకురార్పణ ● 12 వరకు ఉత్సవాలు
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 3వతేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా కన్యా సంక్రమణంలో నిర్వహించే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి గురువారం రాత్రి అంకురార్పణ జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. ఆరోజు ఉదయం స్వామివారి ఉత్సవ కావిడెను ఉపమాక మాడవీధుల్లో ఊరేగించి, బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయంటూ భక్తులకు తెలియజేస్తారు. అనంతరం స్వామివారిని పెద్దపల్లకిలో ఉంచి తిరువీధి సేవ నిర్వహిస్తారు. అంకురార్పణలో భాగంగా గురువారం రాత్రి విష్వక్సేన పూజ, ఉత్సవాంగీకారం, పుణ్యాహవచనం,కంకణ ధారణ నిర్వహిస్తారు. అనంతరం మత్య్సం గ్రహణంలో భాగంగా సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో వేంచేయింపుజేసి ఉత్తర ఈశాన్యంలో గల ప్రాంతంలో మత్య్సంగ్రహణ కార్యక్రమం(పుట్టమన్ను తెచ్చేకార్యక్రమం) పూర్తి చేసి తిరువీధి సేవ నిర్వహిస్తారు. తదుపరి ఆలయంలో నిత్యసేవ, ప్రసాద నివేదన, నీరాజన మంత్రపుష్పాలు తీర్థగోష్టి, ప్రసాద వినియోగం అనంతరం అశ్వవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను వేం చేయింపజేసి గ్రామంలో తిరువీధి సేవ నిర్వహించనున్నట్టు ప్రసాదాచార్యులు తెలిపారు.
అనంతరం తాత్కాలిక యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం, గరుడ అవాహన, గరుడప్పాలు నివేదన , తీర్థగోష్టి కార్యక్రమాలతో మొదటి రోజు కార్యక్రమాలు పూర్తవుతాయని చెప్పారు.
రెండో రోజు శుక్రవారం 4వ తేదీన ఉదయం నిత్యకార్యక్రమాలు బేరీ పూజ, ఉత్సవమూర్తులను పెద్ద పల్లకిలో వేంచేయింపజేసి ముందుగా ఆలయంలోను తర్వాత గ్రామంలో గల అష్ట దిక్పాలకులకు ఆహ్వానం పలకడం జరుగుతుందని ప్రసాదాచార్యులు చెప్పారు. అనంతరం స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజపటాన్ని ఎగుర వేస్తారు. ఉదయం సాయంత్రం సుదర్శన పెరుమాళ్ల వారిని పల్లకిలో వేంచేయింపజేసి గ్రామ బలిహరణలు నిర్వహిస్తారు. సాయంత్రం ఉత్సవమూర్తులను వివిధ వాహనాల్లో ఉంచి తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఉత్సవాల పదిరోజులు ఉదయం సాయంత్రం స్వామివారి దివ్యప్రబంధసేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 9వతేదీ బుధవారం సాయంత్రం వసంతోత్సవం నిర్వహిస్తారు. ఆస్థాన మండపంలో స్వామివారిని ఉంచి సప్త రుషుల ఆవాహనం నిర్వహించి, తర్వాత స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి గ్రామంలో తిరువీధి సేవ జరపనున్నట్టు అర్చకస్వాములు ప్రసాద్, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తెలిపారు. వసంతాన్ని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఎంతో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. 10తేదీన ఆలయంలో ముందుగా అష్టదిక్పాలకుల ఆవాహన తర్వాత రథోత్సవంలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులను పుణ్యకోటి వాహనంలో ఉంచి రథబలి నిర్వహించిన తర్వాత తిరువీధి సేవ నిర్వహిస్తారు. 11వతేదీన సాయంత్రం స్వామివారి పుష్కరిణి వద్ద గల లంకవారి మండపంలోకి స్వామివారి ఉత్సవమూర్తులను గజవాహనంలో తీసుకు వెళ్లి మృగవేట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12వ తేదీన ఆలయంలో నిత్యకార్యక్రమాలు బలివిసర్జనలు పూర్తిచేసిన తర్వాత యాగశాల వద్ద పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం వినోదోత్సవంలో భాగంగా స్వామివారిని ఏడుముసుగులలో అలంకరించి ఉంగరపు సేవ నిర్వహిస్తామన్నారు. తదుపరి పుణ్యకోటి వాహనంలో తిరువీధి సేవ జరుపుతారు.అనంతరం ఆలయంలో లక్ష్మీసంవాదం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, డోలోత్సవం, కంకణ విసర్జనలు, సుదర్శన పెరుమాళ్లవారిని పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి చక్రవారి స్నానం నిర్వహిస్తారు. సాయంత్రం ఉత్సవాలు పూర్తిఅయిన తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది. అదేరోజు రాత్రి స్వామివారి ఆస్థాన మండపంలో ద్వాదశ తిరువారాధన, విశేషప్రసాద నివేదన, తీర్థగోష్టి నిర్వహించడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
10 రోజులపాటు దసరా ఉత్సవాలు
శరన్నవరాత్రులు పురస్కరించుకుని ఉపమాక ఆలయంలో గోదాదేవి సన్నిధిలో పదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో సాయంత్రం లక్ష్మీసహస్రనామకుంకుమార్చన జరుగుతుందన్నారు. విజయదశమినాడు స్వామివారి ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శమీపూజ నిర్వహించనున్నట్టు అర్చకులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment