సాష్టాంగం
సిండికేట్లకు
ఇద్దరు లిక్కర్ కింగ్‌ల సేవలో తరిస్తున్న ఎకై ్సజ్ అధికారులు
● గిరాకీ ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపుల లైసెన్సులపై కన్ను ● లాటరీకి ముందే జోరుగా తెరవెనుక వ్యవహారాలు ● 70 షాపుల కోసం 500 దరఖాస్తులు వేయాలని నిర్ణయం? ● ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్న షాపుల ముందస్తు బుకింగ్?
విశాఖ సిటీ: మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు లిక్కర్ కింగ్‌లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్ని అస్త్రాలతో తెరవెనుక తతంగాన్ని నడిపిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరు సిండికేట్లు నగరంలో కీలక మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి కొంత మంది ఎకై ్సజ్ అధికారులు సైతం శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచే సిండికేట్‌కు సాగిలా పడుతూ.. షాపుల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. లాటరీకి ముందే కొంత మంది అధికారుల సాయంతో షాపుల లీజులకు ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చక్రం తిప్పుతున్న ఇద్దరు సిండికేట్లు
2019 వరకు జిల్లాలో మద్యం వ్యాపారాన్ని ముగ్గురు సిండికేట్లే శాసించేవారు. కానీ ఇప్పుడు ముగ్గురు సిండికేట్లలో కొంత చీలికలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సిండికేట్లు మాత్రం ఈ దఫా జిల్లాలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక సిండికేట్‌కు కూటమి ఎమ్మెల్యే ఆశీర్వాదాలు పుష్కలంగా ఉండడంతో ఈసారి వీరి హవా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు లిక్కర్ వ్యాపార వర్గాల్లో టాక్ నడుస్తోంది. వీరు నగరంలో ప్రధాన ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. విశాఖలో జిల్లాలో 155 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా వ్యాపారం జరిగే ఏరియాలను ఇప్పటికే గుర్తించి వాటిని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించే పనిలో ఉన్నారు. ప్రధానంగా 70 షాపులను చేజిక్కించుకోడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి కోసం 500 దరఖాస్తులు వేయాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది.
షాపుల బుకింగ్‌కు అధికారుల రాయబారం
లిక్కర్ కింగ్‌లు లాటరీకి ముందే షాపులు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. తప్పనిసరిగా వారికే లైసెన్సు వస్తుందన్న గట్టి నమ్మకంతో షాపుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న షాపుల్లోనే లీజులకు తీసుకోవాలని భావిస్తున్నారు. లాటరీ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతమున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ఖాళీ చేయనున్నారు. దీంతో వాటిని తిరిగి లీజుకు తీసుకొని నిర్వహించాలని సిండికేట్‌లు భావిస్తున్నారు. ఇందుకోసం నేరుగా కొంత మంది ఎకై ్సజ్ అధికారులే రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాల యజమానులతో సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు పరిచయముంది. దీంతో వీరి ద్వారా సదరు షాపుల యజమానులతో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌లో కొంతమందిని తీసుకువెళ్లి ఆయా షాపులను వారికి లీజుకు ఇవ్వాలని అధికారులు రాయబారం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటికే 70 షాపులకు సంబంధించి లీజు ఒప్పందాలకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. మున్ముందు ఈ మద్యం షాపుల కేటాయింపులో మరెన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment