మిజోరం గవర్నర్‌ను కలిసిన నాగార్జున
బీచ్‌రోడ్డు: అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మిజోరం గవర్నర్ కె.హరిబాబును సినీ నటుడు నాగార్జున గురువారం దసపల్లా హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పలు విష యాలు చర్చించారు. ఆయన వెంట యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు. 10 రోజుల పాటు విశాఖ లో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని గురువారం హైదరాబాద్ పయనమైన నాగార్జునను అభిమానులు కలిసి ఫొటోలు దిగారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
గోపాలపట్నం: ఆత్మహత్య చేసుకునేందుకు సింహాచలం రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఓ వివాహితను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం–1పై బుధవారం మధ్యాహ్న సమయంలో బుచ్చిరాజుపాలెం సుసర్ల కాలనీకి చెందిన కంచిమోజు అఖిల అనే వివాహిత అనుమానాస్పదంగా సంచరిస్తోంది. గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కె.అనిత ఆమె వద్దకు చేరుకుని ప్రశ్నించారు. అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లగా.. ఏఎస్‌ఐ కె.ఆర్.కె.రావు ఆమె నుంచి వివరాలు సేకరించారు. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చానని, తిరిగి ఇంటికి వెళ్లనని ఆమె తెలిపింది. దీంతో పోలీసులు ఆమె సోదరి కర్రి లీనాకు సమాచారం ఇచ్చారు. ఆమె సింహాచలం రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు భర్త జగదీష్ సమక్షంలో ఆమెను సోదరి లీనాకు అప్పగించారు.
ప్రేమ వంచకుడి అరెస్టు
ఎస్.రాయవరం: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విభీషణరావు గురువారం తెలిపారు. నక్కపల్లి మండలం జి.జగన్నాథపురం గ్రామానికి చెందిన కొత్తూరునాగదేవ ఎస్.రాయవరం మండలానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment