ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా రాజీనామా చేయాలి
● స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే దీక్షలు
అనకాపల్లి: విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తమ పదవులకు రాజీనామా చేయాలని మండల రైతు సంఘాల నాయకుడు బుద్ద రంగారావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానియ్యబోమని, ఆ పరిస్థితి వస్తే తమ పదవులకు రాజీనామా చేసి కార్మికులతో కలిసి పోరాడతామని ఎన్నికల సమయంలో చెప్పిన వీరు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. స్థానిక నెహ్రూ చౌక్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతు, మహిళా, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజు గురువారం కొనసాగాయి. ఆయన మాట్లాడుతూ రెండు మాసాల క్రితం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి 45 రోజుల్లో పరిస్థితి చక్కదిద్దుతానని చెప్పి, ఇప్పుడు ప్రైవేటీకరించే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను దశలు వారీగా ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే కాకుండా, దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచాలని చూస్తున్నాయని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వైఎన్.భద్రం, కర్రి అప్పారావు, నాయినిబాబు, కోటేశ్వరరావు, ఆర్.శంకరరావు, రాజాన దొరబాబు, మోహన్, దాకారపు వరలక్ష్మి, కోరిబిల్లి శంకరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment