నాణ్యమైన భోజనం అందించండి
● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
మధురవాడ: బక్కన్నపాలెంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం గురువారం విచారణ చేపట్టారు. ఇక్కడ శిక్షణ పొందుతూ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు నిర్వాహకులు సరైన భోజనం పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ‘సాక్షి’లో బుధవారం ‘నీళ్లచారు.. పురుగుల అన్నం’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ మేరకు సీతారాం ఐటీఐని పరిశీలించి.. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను ప్రశ్నించగా.. అన్నం ముద్దగా ఉందని, చారు నీళ్లలో ఉండడం వల్ల తినలేకపోతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందివ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నిర్వాహకులను హెచ్చరించారు. ఐటీఐని నిత్యం పర్యవేక్షించాలని అసిస్టెంట్ డైరెక్టర్ మాధవితోపాటు మహిళా పోలీసుకు సూచించారు. మళ్లీ ఫిర్యాదులు రాకుండా చర్యలను చేపట్టాలని, ఈ వ్యవహారంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏడీ మాధవిని ఆదేశించారు. ఐసీడీఎస్ పీవో శ్రీదేవి పాల్గొన్నారు. కాగా.. ఈ వ్యవహారంపై జేసీ మయూర్ అశోక్ ఆరా తీసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment