బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఉత్సవ కావిడిని మాడ వీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో స్వయం వ్య క్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు అభిషే కం, నిత్యపూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచకంగా గ్రామ మాడ వీధుల్లో ఉత్సవ కావిడిని ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు, కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులకు, సుదర్శన పెరుమాళ్లకు ఆలయ అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, పీసపాటి శేషాచార్యులు స్నపన తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామంలో ఉత్తర ఈశాన్యదిక్కున ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి మత్స్యంగ్రహణం (పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం) నిర్వహించారు. తాత్కాలిక యాగశాల వద్ద అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన చతుస్థాన అర్చనలు పూర్తి చేసి గరుడ అవాహన, గరుడ అప్పాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 12 వరకు జరుగుతాయి. 4న ధ్వజారోహణం, 9న వసంతోత్సవం, 10న రథోత్సవం, 11న మృగవేట, 12న వినోదోత్సవంలో భాగంగా స్వామివారికి ఉంగరపు సేవ, పుష్కరిణి వద్ద శమీపూజ ని ర్వహిస్తారు. అనంతరం స్వామివారిని పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజస్తంభం, బేడా మండపం, వేణుగోపాలస్వామి సన్నిధిలో రంగురంగుల పందిళ్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు.
దేవీ వైభవం
అమ్మలగన్నయమ్మను తొమ్మిది రోజులపాటు మనసారా అర్చించే దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రణవ రూపిణి.. శక్తి స్వరూపిణిగా భక్తులను అనుగ్రహించే అమ్మవారి శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. ఒక పక్క భవానీ మాలధారణతో భక్తుల హడావిడి, మరో పక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాల ప్రతిష్టలతో గ్రామాల్లో దసరా సందడి నెలకొంది. ప్రసిద్ధి గాంచిన చోడవరం శ్రీ దుర్గాదేవి ఆలయంలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు అమ్మవారు స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి బాలాలయంలో శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మ వారు స్వర్ణకవచ దుర్గాదేవి ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గాయత్రీదేవిగా అమ్మ దర్శనమిచ్చారు.
–అనకాపల్లి/చోడవరం
మాడ వీధుల్లో ఉత్సవ కావిడి ఊరేగింపు
ఘనంగా మత్స్యంగ్రహణం
రంగురంగుల పందిళ్లు, విద్యుద్దీపాలతో వెలిగిపోతున్న ఉపమాక దేవాలయం
స్వామివారి దర్శనంతో విశేష ఫలితం
కల్కి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వల్ల ఎన్నో విశేష ఫలితాలు వస్తాయని అర్చకులు తెలిపారు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారన్నారు. ఈ సమయంలో స్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment