పాతికిచ్చి.. పదోన్నతిపై వచ్చి?
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల సిఫార్సులు.. దండిగా డబ్బులు ఉంటే చాలు.. అర్హత లేకున్నా అందలమెక్కవచ్చు. ఆరోపణలున్నా.. అవినీతిపై విచారణలు ఎదుర్కొంటున్నా.. అడ్డగోలు పదోన్నతులు పొందవచ్చు. ఎందుకంటే పాతిక లచ్చలు ఇచ్చారుగా మరి.! ఇటీవల జరిగిన బదిలీల్లో కూటమి ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు అందాయనడానికి ఇదో ఉదాహరణ. భారీగా ముడుపులిచ్చిన ఓ అధికారికి విశాఖలో గృహ నిర్మాణశాఖను ఏలేందుకు పెద్ద పోస్టే దక్కింది. అది కూడా పదోన్నతిపై. వాస్తవానికి ఆ పోస్ట్‌కి ఆ ఉద్యోగి పూర్తిగా అనర్హుడు. తొలుత గృహ నిర్మాణ శాఖలో ఏఈగా చేరిన ఆయన తర్వాత డీఈగా బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఈగా పదోన్నతి వచ్చేసింది. ఇక కీలక కుర్చీలో కూర్చొవాలని బుద్ధి పుట్టిన ఆ అధికారికి.. బేరసారాలు కుదరడంతో ఎమ్మెల్యేలు జీహుజుర్ అన్నారు. దీంతో అనుకున్న కుర్చీ దక్కింది. ఎలాంటి అర్హత లేకపోయినా.. ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న ఆ అధికారి వ్యవహార శైలి ఇప్పుడు ఆ శాఖలో కాక పుట్టిస్తోంది.
అర్హత లేకున్నా.. కీలక పోస్టా?
వాస్తవానికి గృహ నిర్మాణ శాఖలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కే ఉన్నతాధికారి హోదాని అప్పగించాలి. కానీ జిల్లాలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. సదరు ఉద్యోగి డిప్లమో చేసి ఉద్యోగం సాధించారు. క్రమంగా ఏఈ నుంచి డీఈగా.. ఇప్పుడు ఈఈగా పదోన్నతి పొందారు. సిఫార్సులతో ఏకంగా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ)గా బాధ్యతలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారిగా బదిలీపై ఇక్కడకు వచ్చేశారు. వాస్తవానికి డిప్లమోతో విధుల్లోకి చేరిన ఉద్యోగి ఉన్నతాధికారి పోస్టుకు పూర్తిగా అనర్హులు. కానీ అతనికి ప్రభుత్వం అధికారికంగా ఇన్‌చార్జి ఎస్‌ఈగా పదోన్నతి కల్పించేసి.. కీలక బాధ్యతలు కట్టబెట్టడం గమనార్హం. ఇందుకోసం కూటమి ఎమ్మెల్యేలకు ఏకంగా రూ.25 లక్షలు ముడుపులు చెల్లించుకున్నారని హౌసింగ్ డిపార్ట్‌మెంట్ గుసగుసలాడుకుంటోంది.
అవినీతి అధికారికి కీలక బాధ్యతలా?
సదరు అధికారిపై మొదటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యవహారంలో అతను రూ.3 కోట్ల వరకు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విచారణ సాగుతోంది. డీఈ హోదాలో ఉన్నప్పుడే ఈ తతంగాన్ని నడిపించారు. అలాగే భీమిలిలో హౌసింగ్ విభాగంలో విధులు నిర్వర్తించిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలా పనిచేసిన చోట్ల అవినీతి వ్యవహారాలు నడిపిన వ్యక్తికి.. ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గృహనిర్మాణ శాఖలో అడ్డగోలు ప్రమోషన్
ఈఈ స్థాయి ఉద్యోగికి
ఉన్నతాధికారిగా పోస్టింగ్
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
వ్యవహారంలో అతని అవినీతిపై
విజిలెన్స్ విచారణ
కూటమి ఎమ్మెల్యేలకు రూ.25 లక్షలు
ముడుపులు చెల్లించినట్లుగా ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment