రూ.100 కోసం హత్యాయత్నం
● అప్పు తీర్చమన్నాడని బ్లేడుతో దాడి ● యలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో ఘటన ● నిందితుడిపై ఇప్పటికే పోక్సో కేసు నమోదు
యలమంచిలి రూరల్: తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.100ను తిరిగి అడిగినందుకు పదునైన బ్లేడ్‌తో దాడికి పాల్పడడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. యలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తలి గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణ, నూకిరెడ్డి శ్రీనివాసు రోజువారీ కూలీలు. గతంలో బంగారి వెంకటరమణకు అవసరం మేరకు శ్రీనివాసు రూ.100 అప్పుగా ఇచ్చాడు. తానిచ్చిన రూ.100 తిరిగివ్వాలని శ్రీనివాస్ ఎన్నో సార్లు వెంకటరమణను అడిగాడు. బుధవారం కూడా వెంకటరమణను శ్రీనివాస్ డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత వెంకటరమణ సమీపంలో ఉన్న దుకాణం వద్ద కొత్త బ్లేడు కొనుగోలు చేశాడు. అనంతరం గ్రామంలో రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాసు దగ్గరికి వెళ్లి బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. శ్రీనివాసు మెడ, తల, చేతులు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో సొ మ్మసిల్లిపోయిన బాధితుడ్ని 108 వాహనంలో య లమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ కొత్తలి గ్రామానికి వెళ్లి ఘటనపై ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించా రు. నిందితుడు వెంకటరమణపై ఇప్పటికే యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదై కేసు కోర్టులో నడుస్తోంది. నిందితుడిని కొత్తలి రైల్వేగేటు వద్ద అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment