సాక్షి, విశాఖపట్నం: కేవలం ప్రభుత్వాదాయం పెంచుకోవడానికే అన్నట్టుగా కొత్త ఎకై ్సజ్ పాలసీ రూపొందించారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ వ్యాఖ్యానించారు. కొత్త మద్యం విధానంపై స్పందిస్తూ.. సీఎం చంద్రబాబుకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కొత్త పాలసీలో యువత, మహిళల సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కనిపించలేదని, కేవలం ఖజానాలో డబ్బులు నింపేలా మద్యం విధానాన్ని రూపొందించినట్టు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. టీడీపీ–జనసేన 2024 ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం యువత, మహిళా సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కొత్త విధానంలో కనిపించకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర సమాజ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018–19లో చేసిన సర్వే ప్రకారం.. మన రాష్ట్ర జనాభాలో 6 శాతం మంది మద్యానికి పూర్తిగా బానిసలుగా మారి వ్యాధుల బారిన పడ్డారని తేల్చిందన్నారు. జాతీయ స్థాయిలో అధికంగా మద్యపానానికి ప్రభావితమైన రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఓ వైపు రాష్ట్ర ఆదాయం పెరిగినా.. మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది చిన్న కుటుంబాలు నష్టపోతాయని, దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.
మద్యానికి బానిసలవడం వల్ల మహిళల మీద అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయని, కుటుంబ ఆదాయం తగ్గి, పిల్లల చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో 30 శాతం తగ్గుదల దిశగా పాలసీ ఉండాలే తప్ప.. ఖజానా నింపేసుకునేందుకు కాదన్నారు. విక్రయాల్లోనూ వ్యక్తిగత పరిమితిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొత్త విధానంపై రాష్ట్రంలో మహిళా సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని శర్మ తన లేఖలో స్పష్టం చేశారు.
మద్యం అమ్మకాల్లో 30 శాతం తగ్గుదల దిశగా పాలసీ ఉండాలి
విక్రయాల్లో వ్యక్తిగత పరిమితిని
ప్రవేశపెట్టాలి
సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ
Comments
Please login to add a commentAdd a comment