కలిగొట్లలో అసంపూర్తి వంతెన పరిశీలన
● వీఎంఆర్డీఏ కమిషనర్‌తో కలిసి సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్
దేవరాపల్లి: కలిగొట్ల వద్ద అసంపూర్తిగా నిలిచిన వంతెనను కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం పరిశీలించారు. మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అనుసంధానిస్తూ విశాఖపట్నానికి 80 అడుగుల మేర రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వినతి మేరకు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఆర్ అండ్ బీ, రెవెన్యూ అధికార్లతో కలిసి కలెక్టర్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదిత మార్గంలో పర్యటించారు. కలిగొట్ల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని స్థానిక అధికార్లను ఆమె ఆరా తీయగా, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలానికి నష్టపరిహారం చెల్లించకపోవడంతో పనులు జరగలేదని వివరించారు. కె.కోటపాడులో బయలుదేరి దేవరాపల్లి మండలం కలిగొట్ల, చీడికాడ మండలం అర్జునగిరి మీదుగా మాడుగుల చేరుకున్నారు. ఆయా మండలాల అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ.. 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ రోడ్డును రెండు దశలలో నిర్మిస్తామన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా కావడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment