చోడవరం రూరల్: గంజాయి రవాణాకు పాల్పడిన ఐదుగురు నిందితులకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విఽధిస్తూ స్థానిక 9వ అదనపు సెషన్స్ జడ్జి కె.రత్నకుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎస్పీ తుహిన్ సిన్హా అందచేసిన వివరాల ప్రకారం.. చీడికాడ మండలం బయలుపూడి గ్రామానికి చెందిన నిందితులు జాజిమొగ్గల సంతోష్, వడ్డాది రమణ, పెదబయలు మండలం కిముడిపల్లి గ్రామానికి చెందిన సీచర్ల సుబ్బారావు, చింతాడ లక్ష్మయ్య, కొర్రా బాబురావులు 120 కేజీల గంజాయిని నాలుగు మూటలలో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. 2015లో చీడికాడ సమీపంలో ఎస్‌ఐ డి.విశ్వనాథానికి అందిన ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్‌పై గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఐదుగురి నుంచి నాలుగు మూటలలో 120 కేజీల గంజాయిని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితులపై మోపిన నేరారోపణ అభియోగం పూర్వాపరాలను, సాక్షులను విచారించిన మీదట నిందితులు ఐదుగురిపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరపున ఉగ్గిన వెంకటరావు తన వాదనలు వినిపించారు. ఎస్‌ఐ విశ్వనాథం, పీపీ వెంకటరావు, సిబ్బందితోపాటు కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment