క్యాన్సర్‌ను జయిద్దాం..!
● ముందస్తు పరీక్షలతో ప్రాణాలు పదిలం ● ఆయుష్మాన్ ఎన్‌సీడీ–3.0 పథకంలో ఇంటింటికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ● 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా పరీక్షలు ● గుర్తించిన రోగులకు ఫాస్ట్ ట్రాక్ చానెల్ ద్వారా చికిత్స
సాక్షి, అనకాపల్లి: క్యాన్సర్.. ఆ మాట వింటే ఒకప్పుడు వెన్నులో వణుకు పుట్టేది. ఆ రుగ్మత సోకితే ఇక చావే గతి అన్న భయం ఉండేది. వ్యాధి కన్నా ఆ భయంతోనే ఎక్కువగా కుంగిపోయేవారు. అప్పటితో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం వైద్య రంగం సాధించిన ప్రగతితో క్యాన్సర్‌ను కూడా జయిస్తున్నారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే ఆ మహమ్మారిని ఇట్టే పారదోలవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అలా క్యాన్సర్‌ను జయించి పునర్జన్మ పొందిన వారు చాలామంది ఉన్నారు. వైద్య నిపుణుల సాయంతో, సాంకేతిక సహకారంతో, అన్నింటినీ మించి బతికి తీరాలన్న బలమైన కాంక్షతో.. క్యాన్సర్‌పై విజయం సాధించిన వారు ఉన్నారు. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో తొలి దశలో గుర్తించకపోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో సీ్త్రలు ఎక్కువగా రొమ్ము, గర్భాశయం, పెద్ద పేగు క్యాన్సర్‌ల బారిన పడితే.. వారిలో సగానికి పైగా అవగాహన లేక వ్యాధి ముదిరి మృత్యువాత పడుతున్నారు. పురుషుల్లో ఊపిరిత్తులు, నోటి, కాలేయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ ఎన్‌సీడీ–3.0 పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి క్యాన్సర్ పరీక్షలు చేసే విధంగా ఈ నెల 14 నుంచి మూడు నెలలపాటు సర్వే జరుపుతోంది. సర్వేతోపాటు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్‌ను కూడా చేర్చి.. ఆ పథకంలో రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందించడంతో రాష్ట్రంలో క్యాన్సర్ మరణాలు తగ్గాయి. ప్రత్యేకించి అనకాపల్లి జిల్లాలో సత్ఫలితాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment