పరస్పర సహకారంతో పోలీస్ విధులు
ఆరిలోవ(విశాఖ తూర్పు): పోలీస్ వృత్తిలో ఉన్న వారికి పరస్పర సహకారం అవసరమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. విశాఖపట్నం విశాలాక్షినగర్‌లోని ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా పోలీసులకు వార్షిక స్పోర్ట్స్ మీట్– 2024 నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మీట్‌ను శుక్రవారం ఎస్పీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. శాంతి కపోతాలు, బెలూన్లు గాలిలోకి ఎగురవేశారు. స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న పోలీసులు క్రీడా పతాకాలతో ఆయనకు గౌరవ వందనం చేశారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం సబ్ డివిజన్ల ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది చేపట్టిన మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, తదితర క్రీడల్లో వ్యక్తిగతంగా, జట్టుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసులందరూ నియమాలు తప్పకుండా పాటించి, క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని కోరారు. పోలీసులు 365 రోజులు మానసిక ఒత్తిడితోనే విధులు నిర్వహించా ల్సి ఉంటుందని, దానిని అధిగమించాలని సూచించా రు. క్రీడలు పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి, మానసిక స్థైర్యం, మానసిక ఉల్లాసం, ఆహ్లాదం కలిగిస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రీవాణి, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment