బడుగులపై ఫీజుల పిడుగు
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజుల భారం పిడుగులా పడడంతో బడుగులు అల్లాడిపోతున్నారు. వారి గోడు వినే నాథులే కరువయ్యారు. పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 25 శాతం సీట్లు వారికి ఉచితంగా ఇవ్వమని రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవో 24 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అడ కత్తెరలో పోక చెక్కలా తయారైంది.
● ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్న కూటమి ప్రభుత్వం
● విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు
● 2023లో జీవో 24 విడుదల చేసిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
● ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1812మంది విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు
● హైకోర్టు తీర్పుతో జీవో రద్దు.. సీట్లు పొందిన వారి పరిస్థితి అగమ్యగోచరం
● వారి నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు
సాక్షి, అనకాపల్లి: సామాన్యులకు విద్యను చేరువ చేయడం కూటమి ప్రభుత్వానికి నచ్చదు. అందుకే అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనలాంటి పథకాలను నిలిపివేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు కనీసం వేరే పేర్లతో అయినా వాటిని అమలు చేయలేదు. ఇప్పుడు తాజాగా.. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత సీట్లు పొందిన వారు ఫీజులు చెల్లించాలన్న ఒత్తిడి పెరగడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాహక్కు చట్టం 2009–12 (1సీ) ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్న ఆశయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవో నెం.24ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఇది రెండో సంవత్సరం. 2024–25 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో 2,291 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారిలో 1812 మంది అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందారు. వీరికి జిల్లావ్యాప్తంగా 312 కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో సీట్లు కేటాయించారు. ఇంతలో యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ గొల్లపూడి మోహన్‌రావు హైకోర్టులో పిల్ వేయడంతో ఆ జీవోను జూన్ 24న రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
స్పందించని కూటమి ప్రభుత్వం
ఫీజులు వసూలు చేయకూడదు
హైకోర్టు జీవో 24ను రద్దు చేసింది. అయితే ఈ జీవో ప్రకా రం అడ్మిషన్ పొందిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయమని ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు ఫీజులు వసూలు చేయకూడదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం.
– అప్పారావునాయుడు, డీఈవో, అనకాపల్లి
ఇలాంటి జీవోలను
పునరుద్ధరించాలి
పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అభ్యసించేలా ఉన్న జీవో 24ను పునరుద్ధరించాలి. ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులతో పాటు గతేడాది చేరిన విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రైవేట్ యాజమాన్యాలు అందించాలి. లేదంటే ఎస్‌ఎఫ్‌ఐ తరపున ఉద్యమిస్తాం. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలి.
– ఎం.రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
పేదోడికి దూరంగా చదువు
కూటమి ప్రభుత్వంలో పేదవాడికి చదువు దూరమవుతోంది. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన లాంటి పథకాలను నిలిపివేయడంతో వారికి ఉన్నత చదువులు భారంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఇదే ధోరణి కొనసాగిస్తే పేద విద్యార్థులు చదువులు మాని కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
– సీహెచ్ శివాజీ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అపీల్‌కు వెళితే పేదలకు అనుకూలంగా తీర్పు వచ్చేదేమో! కానీ మిన్నకుండిపోవడంతో వారికి ఇప్పుడు తంటా వచ్చింది. ఫీజులు చెల్లించమని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఉచిత సీటు వచ్చిందని ప్రైవేటు విద్యా సంస్థల్లో జాయిన్ చేశామని, తమకు బాధ్యత లేదని కూటమి ప్రభుత్వం ముందే ప్రకటించి ఉంటే బాగుండేదని వారు వాపోతున్నారు. విద్యా సంవత్సరం మొదలై దాదాపు ఆరు నెలలు కావస్తోంది. మధ్యలో స్కూలును మార్చలేక, ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో అప్పులు చేసి4 ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది సీట్లు పొందిన వారితో కలిపితే బాధిత విద్యార్థులు మొత్తం 4 వేలమందికి పైగా ఉంటారు. పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం కనికరించాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment