పాఠశాల స్లాబ్ పెచ్చులూడి విద్యార్థి తలకు గాయం
గొలుగొండ: స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి స్కూల్ వరండా స్లాబ్ పెచ్చులూడి గాయమైంది. స్లాబ్ రాయి విద్యార్థి నుదుటికి తగలడంతో గాయపడ్డాడు. రక్తం రావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు దగ్గరే ఉన్న గొలుగొండ పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మండలంలోని నర్సింగబిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 11 గంటల సమయంలో ఉపాధ్యాయుడు గణేష్ వరండాలో పిల్ల లకు బోధిస్తున్నారు. ఆ సమయంలో స్లాబ్‌కు పెచ్చులూడాయి. అందులో ఓ రాయి 5వ తరగతి విద్యార్థి రాయపురెడ్డి లక్ష్మణ్ నుదుటిని గట్టిగా తాకింది. స్లాబ్ పెచ్చు నేరుగా విద్యార్థి తలపై పడితే పెద్ద ప్రమాదమే జరిగేది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంఈవో–2 ఏవీఎన్‌ఎస్ మూర్తి పాఠశాలకు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. వరండాలో తరగతులు నిర్వహించవద్దని ఉపాధ్యాయులకు చెప్పారు. పాఠశాల మరమ్మతుల కోసం నిధుల మంజూరు కోరుతూ ఎంఈవో సత్యనారాయణ పలుమార్లు జిల్లా విద్యాశాఖకు నివేదించారు. అధికారులు వెంటనే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తల్లిదండ్రులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment