పథకాలు అమలైతేనే జిల్లా ప్రగతి
తుమ్మపాల: ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడంలో అధికారులు మరింతగా దృష్టి సారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ, రోడ్లు భవనాలు, గ్రామీణాభివృద్ధి, మెప్మా, విద్యుత్ శాఖ, పశుసంవర్ధకశాఖ, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పథకాల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు మాత్రమే జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, క్లాప్‌మిత్రలకు ప్రతి నెల జీతాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 10 అంశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రమాణాల మేరకు అమలు చేసిన ఉత్తమ పంచాయతీల సర్పంచ్‌లను గణతంత్ర దినోత్సవ వేడులకు అతిథులుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. లాక్‌పతి దీదీ యోజన పథకం ద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ. 10 వేలు ఆదాయం పొందేలా ప్రోత్సాహం అందించాలన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా గృహస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీతో సోలార్ పథకం అందించనున్న నేపథ్యంలో వారితో ఈ పథకానికి దరఖాస్తు చేయించాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్న అత్యవసర వైద్య సేవలు పొందేందుకు 1962 నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుందని రైతులకు తెలపాలన్నారు.
డిసెంబర్‌లో పాఠశాలల కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, షెడ్యూల్ ప్రకారం ఆహ్వాన పత్రికను విద్యార్థులే రూపొందించి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహంచాలని కలెక్టర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా నిర్వహించాలన్నారు. అధికారులెవరూ సోమవారం సెలవు పెట్టకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గణాంకాధికారి జి.రామారావు, పశుసంవర్ధక శాఖాధికారి బి. రామమోహనరావు, డీఆర్‌డీఏ పీడీ కె. శచీదేవి, హౌసింగ్ పీడీ వై. శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.వి.నాయుడు, ఇతర జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు మొదటి ప్రాధాన్యం
ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీతో సోలార్ పథకం
ఉత్తమ సర్పంచ్‌లకు గణతంత్ర దినోత్సవంలో గౌరవం
సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment