ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఫిర్యాదు
● తప్పుల తడకగా తాండవ ప్రాజెక్టు నీటి సంఘం జాబితా
● అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు
● బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు వెంకట రమణారావు
నాతవరం: తాండవ రిజర్వాయర్ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి తయారు చేసిన ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు, చెరువుల పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి లాలం వెంకట రమణారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోనే మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో భూములున్న అనేక మంది రైతుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవన్నారు. గతంలో తాను తాండవ ప్రాజెక్టు పరిధిలో 21వ సెగ్మెంట్ నీటి సంఘం డైరెక్టర్‌గా, అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యానన్నారు. ఇటీవల అధికారులు ప్రకటించిన ఓటర్ల జాబితాలో తన పేరు లేదన్నారు. తనలాగే నాతవరం మండలంలో అనేక మంది రైతులకు ఓటు హక్కు లేకుండా తప్పుల తడకగా ఓటరు జాబితా తయారు చేశారన్నారు. ఎన్నికలు జరిగే తాండవ రిజర్వాయర్, ఎర్రిగెడ్డ ఆనకట్టు పరిధిలో అనేక మంది రైతులకు ఓట్లు లేవన్నారు. గతంలో పలుమార్లు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసిన వారు, ఓటు వేసిన రైతుల పేర్లు కూడా ఓటరు జాబితాలో లేకపోవడం దారుణమన్నారు. నాతవరం, ములగపూడి, పెదగొలుగొండపేట, వెదురుపల్లి, గునుపూడి, గన్నవరం, శృంగవరం, ఎం.బి.పట్నం గ్రామాల్లో సైతం రైతుల ఓట్లు గల్లంతు అయ్యాయన్నారు. దీనిపై అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారన్నారు. ఈనెల 23న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటంతో భూములున్న రైతులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment