ఆంజనేయ వాహనంపై వెంకన్న తిరువీధి
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి ఆంజనేయ వాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. గరుడాద్రిపై వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు ఉదయం పూజలు, నిత్యార్చనలు, అభిషేకాలు చేశారు. కొండ దిగువన ఉత్సవమూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామివారికి, గోదాదేవి అమ్మవారికి నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామిని ఆంజనేయ వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పెద్ద పల్లకిలో ఉంచి మాడ వీధుల్లో ఊరేగించారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో రెండో పాశురం విన్నపంతో ప్రత్యేక నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో ప్రముఖ కవయిత్రి, విశ్రాంత తెలుగు పండిట్ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి తిరుప్పావై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment