పారిశ్రామిక ప్రమాదాల నియంత్రణలో పోలీసులు కీలకం
● పోలీసులకు మూడు రోజుల పాటు ఫైర్ సేఫ్టీలో శిక్షణ ● ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా
పరవాడ: పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల పట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఫార్మాసిటీలో ఎంఏఎస్‌ఎం సమావేశ మందిరంలో జిల్లా పోలీసులకు ఫైర్ సేఫ్టీపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. అత్యవసర సమయాల్లో అగ్నిప్రమాదాల నుంచి ప్రాణాలను రక్షించే శిక్షణలో పోలీసులు ప్రావీణ్యం సంపాదించాలన్నారు. ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రజలు పోలీసులనే ఆశ్రయిస్తారని అందువల్ల పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాల నివారణపై పోలీసులు కూడా ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సరైన శిక్షణ లేకపోతే ఇతరులను రక్షించలేకపోవడమే కాకుండా తమ ప్రాణాలకూ ముప్పు కలుగుతుందన్నారు. అందుకే ఫైర్ సేప్టీపై పోలీసు యంత్రాంగం అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో గ్యాస్ లీకేజీ, బాయిలర్ పేలుళ్లు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నందున వాటికి తగ్గ నియంత్రణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏ విధంగా పనిచేస్తుందో.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లారస్ ల్యాబ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(సేప్టీ) శ్రీనివాస్ అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో అనకాపల్లి సబ్‌డివిజన్, నర్సీపట్నం, పరవాడ సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా ఆర్మ్‌డ్, రిజర్వ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment