చెరకు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమిస్తాం
● వైఎస్సార్‌సీపీ హయాంలోనే రైతులను ఆదుకున్నాం ● మాజీ విప్ కరణం ధర్మశ్రీ
చోడవరం: సంక్రాంతిలోగా చెరకు రైతుల బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామని మాజీ విప్ కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ క్రషింగ్ సీజన్ నాటికి రైతులకు చెరకు బకాయిలన్నీ చెల్లించే వాళ్లమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ గతేడాది చెరకు బకాయిలు టన్నుకు రూ. 350 చొప్పున చెల్లించలేదన్నారు. గేటు ఏరియాకి సరఫరా చేసిన రైతులకు అదనంగా టన్నుకు మరో రూ. 50 చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. వీటితోపాటు కార్మికుల జీతభత్యాల బకాయిలు రూ. 15 కోట్లు చెల్లించాలన్నారు. ఫ్యాక్టరీలో గతేడాదికి సంబంధించిన మొలాసిన్, పంచదార, కరెంటు అమ్మితే రూ. 9 కోట్లు వస్తాయని, రూ.6 కోట్లు మాత్రమే ప్రభుత్వం గ్రాంట్‌గా ఇస్తే సరిపోతుందని చెప్పారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి ఈ మొత్తం తెచ్చి వెంటనే రైతులకు, కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019కి ముందు టీడీపీ హయాంలో రూ. 170 కోట్లు మేర రుణాల ఊబిలో కూరుకుపోయిన ఫ్యాక్టరీపై భార పడకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రూ.130 కోట్లు వరకూ తీర్చిందన్నారు. అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెరకు బకాయిలు, కార్మికుల జీతభత్యాలు చెల్లించేందుకు ఏటా రూ. 8 కోట్లు నుంచి రూ.15 కోట్లు వరకూ ఇచ్చారన్నారు. రూ.90 కోట్లు గ్రాంటుగా తెచ్చామని చెప్పారు. ఏటా క్రషింగ్‌ను ఈ నెల 15వ తేదీలోపే ప్రారంభించేవారమని, ఈ ఏడాది ఇంతవరకూ ప్రారంభించే పరిస్థితి కనిపించలేదన్నారు. ముందుగా క్రషింగ్ ప్రారంభిస్తే, శీతాకాలంలో చెరకులో రస నాణ్యత బాగుండి మంచి దిగుబడి వస్తుందని, రైతులకు, ఫ్యాక్టరీకి మేలు కలుగుతుందన్నారు. గత మహాజన సభలో గత ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు కంటే ఒక్క రూపాయి అయినా అదనంగా తెస్తామని చెప్పిన చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు ఇప్పటి వరకూ తేలేదన్నారు. దీనిపై జిల్లా మంత్రులు, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, అధికారులు చొరవ తీసుకొని సంక్రాంతి లోగా రైతులకు పాత బకాయిలన్నీ చెల్లించాలన్నారు. ఈ విషయమై రైతులతో కలిసి ఫ్యాక్టరీ పర్సన్ ఇన్‌చార్జి, జిల్లా కలెక్టర్‌కు, ఫ్యాక్టరీ ఎండీకి వినతిపత్రం ఇస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంపలి ఆనందీశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ బొడ్డేడ సూర్యనారాయణ, ఉప సర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment