ఫిబ్రవరిలోగా పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ
అనకాపల్లి: ప్రభుత్వ పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోపు ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో ఏప్రిల్ నుంచి పెన్షన్ నిలుపుదల చేస్తామని జిల్లా ఖజానా అధికారి వి.ఎల్.సుభాషిణి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నర్సింగరావుపేట ఏఫీటీఎఫ్ భవనంలో జాతీయ పింఛనుదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెన్షనర్ల పితామహుడు డి.ఎస్.నకారా చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలో పెన్షనర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ట్యాక్స్ చెల్లించాలని కోరారు. పెన్షనర్ల సమస్యలు ఉన్నట్లయితే తమ కార్యాలయంలో దిగువ స్థాయి సిబ్బందిని కలిసి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం 80 సంవత్సరాలు పైబడిన 10 మంది పెన్షనర్లను సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డాది జగన్నాథరావు, కార్యదర్శి బి.ఎల్.ఎన్.శర్మ, కోశాధికారి కె.సత్యారావు, గౌరవాధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యం, విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతి, ఉడ్‌పేట యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎ.గోవిందరావు, పింఛనుదార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment