ఆగని కడుపు కోతలు
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో 45 శాతానికి పైగా సిజేరియన్లు ● సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా శస్త్రచికిత్సకే మొగ్గు ● ప్రభుత్వ నిబంధనలు పట్టని ప్రైవేటు యాజమాన్యాలు ● పిల్లలు, తల్లుల ఆరోగ్యంపై ప్రభావం
బిడ్డను నవ మాసాలు మోసే తల్లిపై కొందరు ప్రైవేటు వైద్యులు కనీస మానవత్వం చూపడం లేదు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా ధనార్జన కోసం శస్త్రచికిత్సకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. అవసరం లేకపోయినా చేస్తున్న సిజేరియన్ ఆపరేషన్లు పిల్లలు, తల్లుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి.
యలమంచిలి రూరల్:
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల తీరు మారడంలేదు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే వైద్యులకు సూచిస్తున్నా అవేమీ పట్టని వైద్యులు సిజేరియన్లకే మొగ్గు చూపిస్తున్నారు. కడుపులో బిడ్డ బయటకు రావాలంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేయడమే శరణ్యంగా మారింది. కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అనధికార వసూళ్లతో ఇటీవల సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. కాసుల కోసమే కోతలు కోస్తున్నారన్న విమర్శలు తల్లుల కుటుంబీకుల నుంచి వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు సమకూరడం, ఇక్కడ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో చాలామంది ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం చేరుతున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వచ్చిన వారికి సిజేరియన్లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. మరికొందరు వైద్యులైతే వ్యాపార ధోరణితోనే ఆస్పత్రులు నిర్వహిస్తూ కోతలకే ప్రాధాన్యమిస్తూ సొమ్ము చేసుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశాలిస్తు్‌ాన్న ఆశించిన ఫలితం కనిపించడంలేదు.
మహిళల ఆరోగ్యంపై ప్రభావం
సిజేరియన్లతో మహిళలు భవిష్యత్తులో పలు రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఆపరేషన్ చేసిన ప్రదేశంలో గాయం మానకపోవడం, అనస్తీషియా సమస్యలు, తల్లి కోలుకునే వరకు ఎక్కువ సమయం పట్టడం, మరీ ముఖ్యంగా శస్త్రచికిత్స సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం జరుగుతుంటాయి. అలాగే గర్భాశయ ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు.
ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల ద్వారా జరిగే ప్రసవాలపై జిల్లా అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
అవగాహన కరువు..
సాధారణ ప్రసవాలపై గర్భిణుల్లో అవగాహన ఉండడంలేదు. సాధారణ ప్రసవాల వలన కలిగే లాభాలు, ఆరోగ్య పరిస్థితి, సిజేరియన్ల వలన వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇతర ఆరోగ్య సమస్యలపై ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. సిజేరియన్ ఆపరేషన్‌లను ప్రోత్సహిస్తున్న ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటే తప్ప సాధారణ ప్రసవాలు పెరిగే అవకాశం ఉండదని కొందరు విశ్రాంత వైద్యులు అంటున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో
ధనార్జనే ధ్యేయంగా..
ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించాలని.. అత్యవసరమైతే తప్ప శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయాలని ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. మహిళల ఆరోగ్యం ఏమైతే తమకేంటనే ఉద్దేశంతో ధనార్జనే ధ్యేయంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. సాధారణ కాన్పులు చేయడం ద్వారా తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, అందులోనూ మొదటి కాన్పును కచ్చితంగా సాధారణమే చేయాలని, ఒకవేళ సిజేరియన్ ద్వారా కాన్పు చేస్తే అందుకు తగిన కారణాలను ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పాల్సి ఉంటుంది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయాలి
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలి. సిజేరియన్లు అధికంగా చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కారణం లేకుండా డబ్బు ఆశతో శస్త్రచికిత్సలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు.
–డాక్టర్ ఎంఎస్‌వీకే బాలాజీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment