హనీ ట్రాప్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్
● బడాబాబులే టార్గెట్‌గా వలపు వల విసిరిన జాయ్ జమీమా ● ఇప్పటికే ఆమెతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ ● తాజాగా కీలక ముఠా సభ్యులు రిమాండ్‌కు తరలింపు ● ఇందులో బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజమిన్ కూడా..
ఒక్కరి ఫిర్యాదుతో
బయటకొచ్చిన బాధితులు
జాయ్ జమీమా అనేక మంది బడాబాబులకు వలపు వల విసిరింది. వారిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసింది. మరికొంత మందితో సహజీవనం చేసి.. వారి భార్యలకు విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసేంది. అందుకు అంగీకరించని పక్షంలో హత్యాప్రయ త్నం చేసి భారీగా నగదు దోచుకుంది. ఆమె ట్రాప్ లో చిక్కుకున్న ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబ సభ్యులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కంచరపాలెం, ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ కేసులో జాయ్ జమీమా వెనుక ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సమాచారంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అటవీ శాఖ అధికారి వేణుభాస్కర్‌రెడ్డిని, మరో సభ్యుడు కిశోర్ వేములను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. భీమిలి కేసుకు సంబంధించి ఆమెకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మిగిలిన స్టేషన్లలో నమోదైన కేసులపై కూడా ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది.
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురు కీలక ముఠా సభ్యులను కటకటాల్లోకి పంపించారు. ఇందులో బీజేపీకి చెందిన యువ నాయకుడు కూడా ఉన్నాడు. బడాబాబులే టార్గెట్‌గా చేసుకుని వలపు వల విసిరి.. అనేక మంది నుంచి రూ.లక్షల్లో డబ్బు దోచుకున్న జాయ్‌జమీమాతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లు నుంచి సమాజంలో ఉన్నతమైన కుటుంబాలను టార్గెట్ చేసిన ఈ ముఠాలో అటవీశాఖ అధికారి బుచ్చ వేణుభాస్కరరావు, కిశోర్ వేముల ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాలో మరో ముగ్గురు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న కీలక సూత్రధారులు ఫాతిమా ఉస్మాన్ చౌదరి@జోయా, ఆమె భర్త తన్వీర్‌తో పాటు బీజేపీ నాయకుడు అవినాష్ బెంజమిన్‌ను అరెస్ట్ చేశారు.
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
జాయ్ జమీమాను విచారించిన సమయంలో తనను ఏమీ చేయలేరని, రాజకీయ నాయకుల అండ ఉందని పోలీసులను హెచ్చరించింది. విచారణకు సహకరించలేదు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో బీజేపీకి చెందిన యువ నాయకుడు అవినాష్ బెంజమిన్‌తో పాటు దంపతులు ఫాతిమా ఉస్మాన్ చౌదరి@జోయా, తన్వీర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. బాధితుల మీద ఉపయోగించిన మత్తు పదార్థాలు, స్ప్రేల సరఫరాలో వీరు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణకు వచ్చారు. వారి మధ్య భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించారు. వీరి కోసం నిఘా పెట్టగా.. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. కంచరపాలెం పోలీసులు అక్కడకు వెళ్లి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. రిమాండ్ బదిలీ ప్రక్రియ ద్వారా వారిని విశాఖకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. వీరి చేతిలో మరికొంత మంది మోసపోయినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ముందుకు వస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment