కరెంటు ఛార్జీల పెంపుపై 27న ఆందోళన
● ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ
చోడవరం: కరెంటు ఛార్జీల పెంపుపై ఈనెల 27వ తేదీన ప్రజల పక్షాల వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలుపు ఇచ్చారు. ఈ ఆందోళనకు సంబంధించిన ప్రచార వాల్‌పోస్టర్లను చోడవరం వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే నాలుగు సార్లు వివిధ రూపాల్లో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోసిందని ధ్వజమెత్తారు. ప్రజలపై భారాన్ని మోపిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమించాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా కరెంటు ఛార్జీల బాదుడును నిరసిస్తూ ఈనెల 27వతేదీన శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో ఆందోళన చేస్తున్నామన్నారు. ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి చోడవరం విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి, అక్కడ ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇస్తామన్నారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో ప్రజలు,వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిదులు అంతా పాల్గొనాలని ధర్మశ్రీ పిలు ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లా నర్సింగరావు, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంపలి ఆనందీశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ బొడ్డేడ సూర్యనారాయణ, ఉపసర్పంచ్ పుల్లేటి వెంకట్రావు, శరగడం చిమ్మినాయుడు, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నెహ్రూ, యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment