టైం లేదు.. ట్రైన్ లేట్..
● ఆలస్యంగా రైళ్ల రాకపోకలు ● అవస్థలు పడుతున్న ప్రయాణికులు
తాటిచెట్లపాలెం(విశాఖ): రైలు ప్రయాణం.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. నత్త తన గమ్యాన్ని నిర్దేశిత సమయంలో.. తనకున్న వేగంతో చేరుకుంటుంది. కానీ రైలు ప్రయాణం మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఏ రైలు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో పాసింజర్ రైళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేయడంతో గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి ఆలస్యంగా నడిచేవి. మోదీ ప్రభుత్వం వచ్చాక పాసింజర్ రైళ్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాయని ఆశించిన ప్రయాణికులకు నిరాశ ఎదురవుతోంది. ఇటీవల హైదరాబాద్ నుంచి బయలుదేరిన గోదావరి సూపర్‌ఫాస్ట్ దువ్వాడ వరకు నిర్ణీత సమయానికి చేరుకుంది. కానీ దువ్వాడ నుంచి విశాఖపట్నం(17 కిలోమీటర్ల దూరం) చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. ఇలాగే చాలా రైళ్లు అనకాపల్లి, దువ్వాడ నుంచి విశాఖపట్నం స్టేషన్‌కు చేరుకునేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది. ఎంత సూపర్‌ఫాస్ట్ రైలు అయినా ఈ తిప్పలు తప్పడం లేదు. అటునుంచి వచ్చే రైళ్లు మాత్రమే కాదు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే కాచిగూడ, నాందేడ్, విశాఖ, గోదావరి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆధునికీకరణ పనుల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే.. వందే భారత్ రైళ్లు ఎందుకు ఆలస్యం కావడం లేదని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ రెండు రోజులు ఆలస్యమైంది. ఒకరోజు స్టేషన్‌లో రైలు ఇంజిన్ మార్చే క్రమంలో వైర్లు తెగిపోవడం, మరో రోజు గూడ్స్ రైలులో సమస్య తలెత్తడం వల్ల విశాఖకు ఆలస్యంగా చేరుకున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. దీని వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పనుల మీద రైలు ప్రయాణాలు చేసే వారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు రైలు ఆలస్యం వల్ల ప్రయాణికులు ప్లానింగ్ మొత్తం మారిపోతోంది. దీని వల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. అలాగే కనెక్టింగ్ రైళ్లనూ అందులేకపోవతున్నారు. ఒక రైలు ఆలస్యం అయితే దానిపై ఆధారపడి ఉండే ఇతర రైళ్లు లేదా బస్సులు తప్పిపోతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment