వైభవంగా కనకమ్మవారి సారె ఊరేగింపు
కశింకోట : కశింకోటలో బుధవారం రాత్రి కనకమహాలక్ష్మి అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా స్థానిక గవరపేటలోని కనకమహాలక్ష్మి అమ్మ వారి ఆలయంలో భక్తులు తెచ్చిన లడ్డులు, వివిధ రకాల తీపి, కారం పిండి వంటలు, అరటి గెలలు నివేదించారు. అర్చకులు వి.చిదంబరం, వి.కృష్ణ పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన ట్రాక్టర్‌పై నిలిపి కోలాటాలతో సారె ఊరేగింపు ప్రారంభించారు. అక్కడి నుంచి మేదరవీధి, సంతబయల, పూసర్లవీధి, అగ్రహారం, అమరపల్లి వీధి, ఉప్పునీటి దిబ్బ, ద్వారపురెడ్డి వీధి, సతకంపట్టు, కస్పావీధి రామాలయం, రౌతు వీధి, పెద్ద బజారు, గవరపేట మధ్య వీధి మీదుగా తిరిగి ఆలయం వరకు ఊరేగింపు సాగింది. ఈ సమయంలో అమ్మ వారిని భక్తులు దారి పొడవునా దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. సారె ఊరేగింపుతోపాటు చివరి మార్గశిర గురువారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ భీశెట్టి కుమార్, ఉపాధ్యక్షుడు వేగి సన్యాసినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దాడి నాగరాజు, మాజీ వార్డు సభ్యురాలు సూరిశెట్టి రేవతి, కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment