‘రాజకీయ’ కూల్చివేతలు
నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీలో చురుకై న పాత్ర పోషించిన నాయకులను టీడీపీ నాయకులు టార్గెట్ చేశారు. స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం మున్సిపాలిటీలో రాజకీయ కక్షలతో కూల్చివేతల పరంపర కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం మున్సిపాలిటీ గచ్చపువీధిలో గల వైఎస్సార్‌సీపీ నాయకుడు చిటికెల కన్నబాబు షాపును అధికారులు కూల్చివేశారు. అదే సమయంలో పంట కాలువను ఆక్రమించి నిర్మించిన భవనాన్ని తొలగిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకుడు, అయ్యరక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి సత్యనారాయణ మూర్తి(శ్రీనివాసరావు)కి అధికారులు నోటీసు ఇచ్చారు. శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. వివాదం కోర్టులో ఉండడంతో రెవెన్యూ అధికారులు వెనకకు తగ్గారు. సర్వే నంబరు 115లో ఉన్న భవనంపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. బుధవారం తహసీల్దార్ రామారావు, డివిజనల్ సర్వేయర్, సిబ్బంది బిల్డింగ్‌ను సర్వే చేశారు. అప్పట్లో బైపాస్ రోడ్డు నిర్మాణానికి జిరాయితీ భూమి ఇచ్చామని, మాకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని బాధితులు శ్రీనువాసరావు, శెట్టి సత్యవతి తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. తాము ఆక్రమణకు పాల్పడలేదని, భవనానికి కొన్నేళ్లుగా మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తున్నామని, ప్లాన్ అప్రూవల్ ఉందని వారు తెలిపారు. బిల్డింగ్ కూల్చడానికి రాలేదని కోర్టు ఆదేశాల మేరకు సమగ్ర సర్వే చేసేందుకు వచ్చామని తహసీల్దార్ బాధితులకు సూచించారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ కాలువ భూమిని అక్రమించి నిర్మించినందున బిల్డింగ్ తొలగిస్తున్నామని శ్రీనివాసరావుకు నోటీసు ఇచ్చామన్నారు. ఆయన కోర్టును ఆశ్రయించడంతో సర్వే సమగ్రంగా జరపాలని కోర్టు ఆదేశించిందన్నారు. 115 సర్వే నంబరులో ఉన్న భవనంపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేశాం, నివేదికను కోర్టుకు సమర్పిస్తామన్నారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్
గతంలో కన్నబాబు షాపు కూల్చివేత
తాజాగా అయ్యరక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ భవనం సర్వే
ఆక్రమణకు పాల్పడలేదని శ్రీనివాసరావు స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment