ముగిసిన ప్రధాని పర్యటన
● సాయంత్రం 4.30కు రోడ్ షో ● ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని మోదీ ● పూలతో స్వాగతం పలికిన ప్రజలు ● బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన
విశాఖ సిటీ : ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతంగా ముగిసింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రోడ్ షో, బహిరంగ సభ ప్రశాంతంగా సాగింది. ప్రధాని బుధవారం సాయంత్రం 4.15కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సిరిపురం ప్రాంతంలోని వెంకటాద్రి వంటిల్లు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓపెన్ టాప్ జీప్ ఎక్కారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనాలకు అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రజలు కూడా పూలతో మోదీకి స్వాగతం పలికారు. సాయంత్రం 5.30కు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
జీప్‌లో లోకేష్‌కు దక్కని చోటు
ప్రధాని సభ సందర్భంగా నగరమంతా హోర్డింగ్‌లు, కటౌట్లు వెలిశాయి. అన్నింటిలోను మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలే దర్శనమిచ్చాయి. బీజేపీ వారి ఫొటోలు ఎక్కడా కనిపించలేదు. దీంతో మోదీ రోడ్ షోలో కూడా లోకేష్ ఉంటారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఓపెన్ టాప్ జీప్‌లో లోకేష్‌కు చోట దక్కలేదు. ప్రధాని మోదీ రోడ్‌షో జీప్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురందేశ్వరీలు మాత్రమే ఉన్నారు.
30 వేల మంది రాక
ప్రధాని సభకు భారీగా జనాలను తరలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సభా ప్రాంగణంలో మూడు టెంట్లు ఏర్పా టు చేసి ఒక్కో దానిలో 7 వేల సీట్లను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లో జనాలను తరలించారు. రోడ్ షో, బహిరంగ సభకు లక్ష నుంచి రెండు లక్షల మంది జనాలు వచ్చినట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించినా.. వాస్తవ సీటింగ్ సామర్థ్యం ప్రకారం 30 వేల మంది మాత్రమే సభకు హాజరైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు స్పీచ్ మధ్యలోనే జనాలు జంప్
బహిరంగ సభ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైంది. అనకాపల్లి ఎంపీ సి.ఎం.రమేష్, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. అనంతరం మైక్ అందుకున్న చంద్రబాబు మాత్రం అరగంటకు పైగా మాట్లాడారు. దీంతో ఆయన స్పీచ్ మధ్యలోనే జనాలు వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో అరగంట తరువాత స్పీచ్‌ను వేగంగా పూర్తి చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్ధేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల విలువైన పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సభ అనంతరం ప్రధాని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో భువనేశ్వర్‌కు పయనమయ్యారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పించారు. ఒకవైపు వీఐపీలకు భద్రతా చర్యలు చేపడుతూనే.. మరోవైపు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులు, ప్రైవేటు వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రశాంతంగా ప్రధాని సభ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment