కె.కోటపాడు సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి బదిలీ
● పలు ఆరోపణలపై జిల్లా రిజిస్ట్రార్ విచారణ ● నివేదిక మేరకు చర్యలు
కె.కోటపాడు : పలు ఆరోపణల కారణంగా కె.కోటపాడు సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నంలో చిట్స్ సహాయ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న శకుంతలను నియమించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన బదిలీల్లో భాగంగా పాలకొండ నుంచి కె.కోటపాడు సబ్ రిజిస్ట్రార్‌గా సత్యనారాయణమూర్తి బాధ్యతలు చేపట్టారు. ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోని ఆస్తులను ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు కార్యాలయ సిబ్బందితో కలిసి ఆసశక్తిని చూపుతుండేవారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కె.కోటపాడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని గ్రామాల్లోని క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో పెందుర్తి మండలం నరవలోని నోషనల్ ఖాతాలో ఉన్న భూమిని సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగాలతో పాటు తుంగ్లాంకు చెందిన ఒక కుటుంబంలో జరిగిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌ను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంపై జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు కార్యాలయంలో విచారణ చేపట్టి, ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎనీవేర్‌తో పాటు నిబంధనలు పాటించకుడా జరిగిన రిజిస్ట్రేషన్‌ల వ్యవహారంలో కార్యాలయంలో మరో అధికారి పాత్ర ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment