కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత
● 18 మందికి వాంతులు, విరేచనాలు
● వీరిలో ఒక విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరం
నర్సీపట్నం: మండలంలోని వేములపూడి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని ఆహారం కలుషితం కావడంతోనే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం పులిహోర, రాత్రి అరటి కాయ కూరతో భోజనం చేశారు. భోజనం చేసిన గంట తరువాత నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి. కడుపు నొప్పితో ఆ రాత్రి అంతా విద్యార్థినులు బాధపడ్డారు. మొత్తం 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వీరిలో ఆరో తరగతి విద్యార్థిని పిండి తనోజ్, ఎనిమిదో తరగతి విద్యార్థినులు కె.హేమలత, ఎస్.నవ్యశ్రీ , హేమ అమృత హర్షిణి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వి.కాక్షాయిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సమీపంలోని వేములపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారి అనూష సత్వరం వైద్య సేవలు అందించారు. అయినప్పటికీ తనోజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు నర్సీపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మిగిలిన నలుగురు విద్యార్థినులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ అనుషా, వైద్య సిబ్బందితో హుటాహుటిన కస్తూర్బా పాఠశాలకు చేరుకుని, పాఠశాల సూపరింటెండెంట్ శాంతి పర్యవేక్షణలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న ఎన్.హేమలత, డి.లాస్య, వై.దాక్షాయిని, కె.వసంత దుర్గ, ఎ.లోషిని, జి.రోషిని, జి.కుసుమదుర్గ, డి.సాయి సంధ్యన, ఎ.యశ్వస్విని లక్ష్మి, ఎన్.యశోద, ఎం.కృష్ణకుమారి, వై.లావణ్య, హేమజోషినికి వైద్య సేవలు అందించడంతో వారు తేరుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారి తెలిపారు. పాఠశాలలో మొత్తం 250 మంది పిల్లలు చదువుతున్నారు. తిన్న ఆహారం అరగకపోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment