తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత
● చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంపై ఆగ్రహం ● బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోవడంపై నిరసన ● పెద్దఎత్తున మత్స్యకారులు, మహిళల ఆందోళన ● అడ్డుకున్న పోలీసులు ● రాజయ్యపేటలో ఇరువర్గాల మధ్య తోపులాట
నక్కపల్లి: మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా బల్క్ డ్రగ్ పార్క్‌కు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శంకస్థాపన చేయించడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విశాఖ– చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసం భూములు సేకరించిన రాజయ్యపేట, చందనాడ, బోయపాడు తదితర గ్రామాల్లో మత్స్యకారులు, మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. నిర్వాసితులకు, బాధిత రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ పాకేజీ అందజేయకుండా, పునరావాసం కల్పించకుండా బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకస్థాపన చేయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. దీనికి విశాఖపట్నం నుంచి ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజయ్యపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు వెళ్లి తమ గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించిన మత్స్యకారులు, రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు మద్దతు ఇచ్చేందుకు రాజయ్యపేట వచ్చిన సీపీఎం జిల్లా నాయకులు కోటేశ్వరరావు, అప్పలరాజు, సత్యనారాయణ, రాజేష్‌లతో పాటు మత్స్యకార నాయకులు సోమేష్, బయన్న తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాలని సీఐలు కుమార స్వామి, ఎస్‌ఐ సన్నిబాబు, పోలీసు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మహిళలు పోలీసులపై పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు. మాగోడు చెప్పుకునేందుకు కూడా వెళ్లనివ్వరా అంటూ వాగ్వాదానికి దిగారు. 2014లో భూసేకరణ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, కేవలం నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లు తమ భూముల జోలికి రాలేదని, తాజాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు స్వాధీనం చేసుకుని జీడి, మామిడి, కొబ్బరి తోటలను తొలగించి కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించారన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీల విషయమై రాజయ్యపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లి ప్రశ్నిద్దామని వనిర్ణయించుకున్నామని, పోలీసులు తమను అడ్డుకుని, తమకు సంఘీభావం తెలిపిన వారిని అరెస్టు చేసి దూరప్రాంతాల్లో ఉన్న స్టేషన్లకు తరలించారని, కొంత మందిని హౌస్ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పార్క్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభ వద్దకు ఆందోళనకారులు రాకుండా వందలాది మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment