కమీషన్లకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత
● బెల్ట్‌షాపుల ద్వారా గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం ● చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజం
రోలుగుంట: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కమీషన్లకు ప్రాధాన్యత ఇస్తోందని చోడవరం వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిండుగొండ మాజీ ఎంపీటీసీ శెట్టి వెంకటరాజారావును పరామర్శించడానికి బుధవారం వచ్చిన ధర్మశ్రీ స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ హయాంలో మంజూరైన ప్రాజెక్టులకే బుధవారం ప్రధానమంత్రి మోదీతో షో చేసి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ హయాంలోనే రైల్వేజోన్ మంజూరుకు కృషి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రోలుగుంట మండలంలో ఆథరైజ్డ్, అనాథరైజ్డ్ క్వారీల నుంచి రోజుకు వందలాది లారీలతో మండలం నుంచి 8 ఎంఎం, 10ఎంఎం పిక్క, నల్లరాయి పరిమితికి మించి రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూనిట్ పిక్క రూ.2,400 అయితే లోడుకు అదనంగా రూ.250 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ అదనపు డబ్బులు కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తుందని అనుమానిస్తున్నామని చెప్పారు. చోడవరం నియోజక వర్గంలో బెల్టుషాపుల ద్వారా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఎటి గైరంపేట, రావికమతం, బుచ్చియయ్యపేట మండలాల్లో రూ.78 లక్షలు వెచ్చించి పలు రోడ్ల నిర్మాణం చేపట్టానన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తమ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు కూడా ఎన్నో చేశామన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభు త్వం ఏడు మాసాలైనా రాష్ట్రంలో అభివృద్ధి ఛాయలు కనిపించలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టి సంధ్య, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, శెట్టి సత్యనారాయణమూర్తి, పోతల లక్ష్మీ శ్రీనివాస్, టి.వి.రమణ, పోతల రాజశేఖర్, దోసపత్ని రాజు, దారపురెడ్డి నారాయణమూర్తి, మడ్డు తాతబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment