సీనియారిటీ, సిన్సియారిటీకే అందలం
● పార్టీ బలోపేతానికి స్థిరమైన నిర్ణయాలు ● అధిష్టానం ఆదేశమే అందరికీ శిరోధార్యం ● చోడవరం సమన్వయకర్తగా అమర్‌నాథ్‌ను సూచించా.. ● గెలిపించే బాధ్యత నా భుజాలపై వేసుకున్నా.. ● వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు కరణం ధర్మశ్రీ
చోడవరం: పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీ విజయావకాశాలు మెరుగుపర్చేందుకు స్థిరమైన, బలమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తమకు చెప్పారని ధర్మశ్రీ తెలిపారు. దీనిలో భాగంగానే అసెంబ్లీ సిగ్మెంట్లు, పార్లమెంటు సిగ్మెంట్ల వారీగా కొన్ని మార్పులు చేపట్టారన్నారు. సీనియారిటీ, సిన్సియారిటీ ఉన్న వారి గురించి జిల్లా నాయకులతో చర్చించిన తర్వాత తనను అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడిగా నియమిస్తున్నామని పార్టీ అధినేత చెప్పడంతో తాను అంగీకారం తెలిపానని ధర్మశ్రీ చెప్పారు. తన స్థానంలో ఎవరైతే బాగుంటుందని అధిష్టానం అడిగినప్పుడు ‘ఎవరిని పెట్టినా గెలిపించే బాధ్యత నా భుజాలపై వేసుకుంటాన’ని అధినేతకు చెప్పానన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేరును తాను సూచించానని ధర్మీశ్రీ చెప్పారు. ఒక్క చోడవరమే కాదని, భీమిలి, గాజువాకతోపాటు పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్పు చేశారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు అంతా తనను ఎలాగైతే ఆదరించారో అంతకంటే ఎక్కువగా అమర్‌నాథ్‌ను ఆదరించాలని ధర్మశ్రీ కోరారు.
24న అమర్‌నాథ్ బాధ్యతల స్వీకారం
ఈనెల 24వ తేదీన నియోజకవర్గ సమన్వయకర్తగా అమర్‌నాథ్ బాధ్యతలు స్వీకరిస్తారని, ఈ సందర్భంగా నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ధర్మశ్రీ చెప్పారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ సమావేశానికి చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలానికి చెందిన పార్టీ కేడర్ అంతా హాజరు కావాలని కోరారు. తాను ఈనెల 30వ తేదీన అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడిగా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. పార్టీయే అందరికీ తొలి ప్రాధాన్యత అని.. పార్టీ కోసం అంతా సమష్టిగా పనిచేయాలని ధర్మశ్రీ కోరారు. పార్లమెంటు పరిశీలకుడిగా నియమితులైన ధర్మశ్రీని ఈ సందర్భంగా పార్టీ నాయకులంతా ఘనంగా సత్కరించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, జెడ్పీటీసీలు మారిశెట్టి విజయశ్రీకాంత్, దొండా రాంబాబు, పోతల లక్ష్మీ శ్రీనివాస్, నాలుగు మండలాల ఎంపీపీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment