జనుము
మనసును కట్టెస్తున్న
● ఎకరాకు రూ.40 వేల ఆదాయం ● తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ● సీడ్స్‌తో ఆయుర్వేద ఆయిల్ ● జిల్లాలో సాగుపై రైతుల ఆసక్తి ● రబీలో 10 వేల ఎకరాల్లో పంట
పచ్చని పైరులో పసుపు పూల సోయగంతో ఆకట్టుకునే కట్టె జనుము పంట రైతులకు సిరులు కురిపించడమే కాదు.. నేలను సారవంతం చేస్తోంది. దీని విత్తనాలతో తయారైన ఆయిల్‌తో ఆయుర్వేదంలో మోకాళ్ల నొప్పులకు వినియోగిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ పంటపై జిల్లా రైతులు ఆసక్తి చూపించడమే కాదు.. విస్తారంగా సాగు చేస్తున్నారు.
సాక్షి, అనకాపల్లి: ఖరీఫ్ వరి పంటలో వరుసగా వస్తున్న నష్టాలు.. రబీ అపరాల పంటలకు చీడపురుగుల బెడద.. వెరసి తీవ్రనష్టాలను మూటగట్టుకుంటున్న జిల్లా రైతులకు కట్టె జనుముు లాభదాయకంగా మారింది. పైసా పెట్టుబడి లేకుండా.. ఎటువంటి ఎరువులు వాడకుండా, రూ.వేల లాభాన్ని ఆర్జించి పెడుతుంది. గ్రామాల్లో ఎటు చూసినా పసుపు పచ్చగా.. ఆకర్షణీయంగా కనిపించే జనుముు పంట జిల్లాలో వివిధ మండలాల్లో 10 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో నువ్వులు, అపరాలతోపాటు ఈ పంట వేస్తుంటారు. కట్టె జనుముు ప్యాబేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క పంట వల్ల భూసారం పెరుగుతుంది. రబీలో వేసిన ఈ పంట ఖరీఫ్ సీజన్ నాటికి భూమికి నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు అందిస్తుంది. ఈ పంటను ప్రస్తుతం ఓ వైపు విత్తనాభివృద్ధికి, మరోవైపు ఆయుర్వేదంలో ఉపయోగపడే హెంప్ ఆయిల్ కింద వినియోగిస్తున్నారు.
భూసారం పెంచుకోవచ్చు
మార్కెట్‌లో ధర బాగుండటంతో, ఎలాంటి పెట్టుబడి లేకుండానే లాభాలను పొందే ఆస్కారం ఉంది. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియ దున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు.
కిలో విత్తనాల ధర రూ.80
ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి రావడం, కిలో రూ.80 ధర పలుకుతుంది. ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే కట్టె జనుముు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
మోకాలు నొప్పి తగ్గేందుకు..
కట్టెజనుముు గింజలు పచ్చిరొట్ట ఎరువుకు ఎంత ఉపయోగమో ఆయుర్వేదంలో మోకాలు నొప్పి తగ్గేందుకు కూడా హెంప్ ఆయిల్‌గా తయారు చేసి వినియోగిస్తున్నారు. అందువల్లే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టె జనుముు సాగుకకు గ్లోబల్ ఇండికేషన్‌గా గుర్తింపు పొందే పరిస్థితి తీసుకువచ్చింది. ఇక్కడ నుంచి ఒడిశాకు ఎగుమతి అవుతున్నాయి.
ఒడిశాకు ఎగుమతి..
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తర్వాత అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా పండిస్తున్నారు. ఈ విత్తనాలను ఇక్కడ నుంచి ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నారు.
చీడపీడల ప్రభావంతో కట్టె జనుము సాగుపై ఆసక్తి..
రబీ సీజన్‌లో జిల్లాలో ఎక్కవగా నువ్వులు, అపరాల పంటలు వేస్తుంటారు. వీటికి చీడపీడలు బెడద ఎక్కువ కావడం, పెట్టుబడి అధికం కావడంతో కట్టె జనుము సాగుపై వైపు రైతులు మళ్లుతున్నారు. పొలం గట్లపైనా సాగు చేస్తుంటారు.
సాగు లాభదాయకం..
కట్టెజనుముు సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. రబీ సీజన్‌లో జిల్లాలో ఎక్కువగా నువ్వులు పంట వేస్తున్నారు. వాటి తర్వాత పెసర, మినుప, పిల్లి పెసర, బొబ్బరి వంటి అపరాల పంట వేస్తున్నారు. ఈ పంటల కంటే ఎక్కువ ఆదాయం వస్తోండటంతో రైతులు కట్టెజనుముు సాగువైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో పాటు అధిక ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ పంటతో భూసారవంతం పెరుగుతోంది.
– డాక్టర్ మోహన్‌రావు, అగ్రికల్చర్ జేడీ
Comments
Please login to add a commentAdd a comment